17 April, 2026 | 2:09 AM

రంగారెడ్డి జిల్లా అక్రెడిటేషన్ జీవోను సవరించండి

17-04-2026 12:04 AM

మీడియా అకాడమీ చైర్మన్‌కుటీడబ్ల్యూజేయూ విన్నపం

రంగారెడ్డి, ఏప్రిల్ 16(విజయక్రాంతి) రంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TWJU) రంగారెడ్డి జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్  శ్రీనివాస్ రెడ్డి కి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నంబర్ 252 మరియు తదుపరి ఉత్తర్వుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారని ప్రతినిధులు పేర్కొన్నారు.

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి అర్బన్ నియోజకవర్గాల్లో జనాభా మరియు వార్డుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ, కేవలం మండలానికి ఒకటి లేదా రెండు కార్డులు మాత్రమే కేటాయించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి మండలంలో 18 డివిజన్లు ఉండగా, ప్రధాన పత్రికల్లో 5 నుండి 6 మంది విలేకరులు పనిచేస్తున్నారు.

కేవలం ఒక్కరికే కార్డు ఇస్తే మిగిలిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలో పేర్కొన్న ‘లక్షన్నర జనాభా దాటితే అదనపు కార్డు‘ అనే నిబంధనను, ‘ప్రతి లక్షన్నర జనాభాకు ఒక కార్డు‘ గా సవరించాలని కోరారు.సరూర్ నగర్, హయత్ నగర్, బాలాపూర్, గండిపేట వంటి మండలాల్లో పది ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ గతంలో అక్రిడిటేషన్లు ఉండేవని,

కొత్త నిబంధనలతో వారి వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు.పెరిగిన వార్డులు, సర్కిళ్లు మరియు జోన్లకు అనుగుణంగా అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను పెంచి, జర్నలిజం వృత్తిని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని టీడబ్ల్యూజేయూ రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎం.డీ సలీమ్ పాషా, కార్యదర్శి మేకల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.