అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు /కడ్తాల్, ఏప్రిల్ 16(విజయక్రాంతి):పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆమనగల్లు,కడ్తాల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వేర్వేరుగా నిర్వహించిన ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.గ్రామాల్లో విద్య, వైద్యం, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారు.రైతులు తమ సాంప్రదాయ పంటల సాగు తో పాటు పామాయిల్ వంటి వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించి, ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఆమనగల్లు మండలం లో మహిళా సంఘాల కు రూ. 16.61 కోట్లు, కడ్తల్ మండలం లోని మహిళా సంఘాలకు రూ. 40.92 కోట్ల చెక్కుల తో పాటు,కడ్తల్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అధికారులతో కలిసి పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి కేశరామ్, తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత,కుసుమ మాధురి,ఏఎంసీ చైర్మన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,సర్పంచ్ లు పాలకూర్ల కరుణాకర్ గౌడ్, మహేందర్ గౌడ్, గోపాల్,స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






