12-02-2026 01:42:32 AM
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 11 : అగ్రరాజ్యం అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ను వాడుకుని, అవసరం తీరాక టాయిలెట్ పేపర్ కంటే హీనంగా విసిరేసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ జాతీయ అసెంబ్లీలో ఉగ్రవాదంపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో అమెరికా చెప్పినట్లు వినడం వల్ల పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1999 తర్వాత, ముఖ్యంగా 9/11 దాడుల అనంతరం అమెరికాతో చేతులు కలపడం తమ దేశం చేసిన అతిపెద్ద తప్పని ఆసిఫ్ అభిప్రాయపడ్డారు. అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా ప్రయోజనాల కోసం పాకిస్థాన్ తన గడ్డను వాడుకోవడానికి అనుమతించిందని చెప్పారు.
అప్పట్లో తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికాకు మద్దతు ఇవ్వడం వల్ల నేడు పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదం రాజ్యమేలుతోందని విశ్లేషించారు. ఈ వ్యూహాత్మక తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి సైనిక పాలకులు కేవలం తమ అధికారాన్ని కాపాడుకోవడానికి, అగ్రరాజ్యం మెప్పు పొందడానికే పాకిస్థాన్‌ను పరాయి దేశాల యుద్ధాల్లోకి నెట్టారని ఆసిఫ్ విమర్శించారు. అఫ్గాన్ యుద్ధాల్లో తాము ఇస్లాం కోసమో, మతం కోసమో పాల్గొనలేదని,
కేవలం అమెరికాకు తొత్తులుగా వ్యవహరించామని బహిరంగంగా అంగీకరించారు. ఆ యుద్ధాల కోసం దేశ విద్యా వ్యవస్థను కూడా మార్చేశామని, దాని ప్రభావం నేటికీ సమాజంపై కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా తన పనైపోగానే పాకిస్థాన్‌ను గాలికి వదిలేసి వెళ్లిపోయిందని, కానీ ఆ యుద్ధాలే దేశంలో ఉగ్రవాద సమస్యను తెచ్చాయని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి, అశాంతికి గతంలోని ఈ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గత పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సభలో పిలుపునిచ్చారు.