calender_icon.png 21 January, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో సామాజిక అవగాహన కోసం విజ్ఞాన విహార యాత్ర

21-01-2026 04:14:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా విజ్ఞానం పెంపొందించాలనే ఉద్దేశంతో విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమాన్ని బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, నీరుకుల్లా ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు పాఠశాలల నుంచి మూడు, నాలుగు తరగతులకు చెందిన సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ విజ్ఞాన విహారయాత్రకు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు, సహోపాధ్యాయులు సమత, అలాగే నీరుకుల్లా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి నాయకత్వం వహించారు. విద్యార్థులను సుల్తానాబాద్ పట్టణానికి తీసుకువెళ్లి అక్కడి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసేవా కేంద్రాలను సందర్శింపజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించి తపాలా వ్యవస్థ పనితీరు, లేఖలు, పార్సిళ్లు, మనీ ఆర్డర్, పోస్టల్ సేవింగ్స్ వంటి సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి భూమి రికార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విధానం గురించి అవగాహన పొందారు.తదుపరి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులకు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై అధికారులు వివరించారు. అలాగే జిల్లా కోర్టును సందర్శించి న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యత, కోర్టుల విధులు, చట్టాల అమలు విధానం గురించి సరళమైన భాషలో విద్యార్థులకు తెలియజేశారు.

ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందించే సౌకర్యాలు, విద్యాపరమైన సహాయాలపై కూడా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల్లో సంప్రదాయ వృత్తులపై అవగాహన పెంపొందించేందుకు చేతివృత్తులైన చేనేత వృత్తిదారులు, మేదరవృత్తులు, స్వర్ణకారులను సందర్శించారు. చేనేత వృత్తిలో వస్త్రాలు తయారయ్యే విధానం, మేదరవృత్తిలో ఉపయోగించే పనిముట్లు, స్వర్ణకారుల వృత్తిలో బంగారు ఆభరణాలు తయారయ్యే విధానం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రతి వృత్తి సమాజ అభివృద్ధిలో పోషించే పాత్రను విద్యార్థులకు వివరించారు.ఈ విజ్ఞాన విహారయాత్ర విద్యార్థుల్లో ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహనను పెంపొందించడంతో పాటు, సామాజిక బాధ్యత, శ్రమ విలువ, సంప్రదాయ వృత్తుల ప్రాముఖ్యతను తెలుసుకునేలా చేసిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.