తోగ్గూడెం అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరపాలి
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 17, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా సుమారు 10 క్వారీలు , 7 నుండి 8 క్రషింగ్ మిల్లులు నడుస్తున్నాయన్నారు.
ఈ క్వారీలు అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నుండి అనుమతులు పొంది కొందరు దళారులు వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ అంశంపై భారతీయ జనతా పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తూ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ఈ క్రమంలో గనుల శాఖ నిర్వహించిన ఈ ఎస్ టి సర్వేలో తోగ్గూడెం ప్రాంతంలో సుమారు 50 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా అక్రమ తవ్వకాలు జరిగినట్లు అధికార రికార్డులు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
మైన్స్ అండ్ జియాలజీ శాఖ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం తోగ్గూడెం ప్రాంతంలోని పలువురు క్వారీ లీజ్ హోల్డర్లపై ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లకు పైగా డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అక్రమంగా తవ్విన ఖనిజాలపై సెయినియరేజ్ ఫీజు మరియు భారీ పెనాల్టీలు విధించినప్పటికీ కొందరు క్వారీ యజమానులు ఇప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడం ఆశ్చకరమని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.
తోగ్గూడెం ప్రాంతంలో అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మైన్స్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Eౄ) ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కూడా దాఖలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి నోముల రమేష్,గోడుడు శ్రీధర్, విద్యాసాగర్ (కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు),కాల్వ ప్రసాద్, శ్రీనివాస్, మాదారపు లక్ష్మణ్, లింగగిరి వెంకట్రామయ్య, భూక్య మోహన్, భూక్య ఆశ, కోటేశ్వరావు, పవన్, కొత్తపల్లి విజయ్, బానోత్ బాలాజీ లు పాల్గొన్నారు




