సందేశమిచ్చే అనకాపల్లి
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్ర ల్లో నటించిన సినిమా ‘అనకాపల్లి’. ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఆగస్టు 7న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను నిర్మాతలు త్రినాథరావు, కాండ్రేగుల నాయుడు విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ.. “అనకాపల్లి’ కథను నేనే రాసుకున్నా. కానీ తీయకుండా అలా పెట్టేశా. దర్శకుడిగా జర్నీ మొదలైన తర్వాత సమీకరణాలు మారుతూ వచ్చాయి.
అందుకే నా దగ్గర ఉన్న మంచి కథల్ని ఈ బ్యానర్ల మీద తీయాలనుకుంటున్నాం. దాదాపు ఈ మూవీని కూడా నేనే తీసినట్టు చెప్పుకోవచ్చు. (నవ్వుతూ). ఇది ఓ టౌన్‌లో జరిగే లవ్ స్టోరీ. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడున్న జెన్‌జీ తరానికి ఎమోషన్స్ తెలియడం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మళ్లీ అందరికీ తెలియాలని ఈ మూవీ తీశాం. ఓ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నా. దర్శకుడు, హీరో అందరూ కలిసి నన్ను ఒప్పించారు. అందుకే ఇందులో నటించా” అని తెలిపారు. కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. “త్రినాథరావు చెప్పిన ఈ కథ విన్న వెంటనే ప్రాజెక్టుకి ఓకే చెప్పేశా. ఇకపై రెగ్యులర్‌గా సినిమాల్ని నిర్మించాలని అనుకుంటున్నాం” అని చెప్పారు.






