5 August, 2026 | 2:05 AM

బీటలు వారిన చెరువు కట్ట పనులు

05-08-2026 01:24 AM

తాడ్వాయి,ఆగష్టు, 04( విజయ క్రాంతి ): చెరువు కట్టలు,కుంటకట్టలకు మరమ్మతులు చేసి భూగర్భ జలాలను అభివృద్ధి చేస్తూ రైతులకు సాగునీటిని అందించాలనే  లక్ష్యంతో ప్రభుత్వం లక్షలాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుంది.పనులకు అవసరమైన నిధులను మంజూరు చేస్తుంది.కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు పూర్తిగా తూతూ మంత్రంగా సాగుతున్నాయి.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పెద్ద చెరువు కట్ట మరమ్మత్తులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్ మోహన్ రావు చెరువు బాగుండాలనే సంకల్పంతో చెరువు కట్ట మరమ్మత్తుల కోసం రూ.35.20 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో కట్టను బలోపేతం చేసి చెరువు కట్ట కుంగిపోకుండా మరమ్మతులు నిర్వహించాలని సంకల్పించారు. ఇదే లక్ష్యంతో నిధులు మంజూరయ్యాయి. పనులు పూర్తిగా నామమాత్రంగా నిర్వహించారు.

మరమ్మతులు చేసిన కొద్ది రోజులకి చిన్నపాటి వర్షానికి బీటలు వారాయి.అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మరమ్మతు పనులు  అద్వానంగా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు కట్ట మరమ్మతు పనులను పటిష్టమంతంగా చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బీటలు వారిన చెరువు కట్ట..

నందివాడ చెరువు కట్ట మరమ్మతులు చేపట్టి నా కొద్ది రోజులకే బీటలు వారింది. నాణ్యత మర్చారు. మరమ్మతులు చేపట్టి రైతులకు ఉపయోగకరంగా చెరువు కట్టను తీర్చిదిద్దాలి. అధికారులు పర్యవేక్షణ చేయాలి.

- చిట్టెపు దత్తు రెడ్డి,వార్డు సభ్యులు, నందివాడ 

పని ఇంకా పూర్తి కాలేదు

నందివాడ పెద్ద చెరువు కట్టకు నిర్వహిస్తున్న మరమ్మత్తు పనులు ఇంకా పూర్తి కాలేదు. వర్షాలు ముగిశాక తిరిగి మరమ్మత్తు పనులు చేయిస్తాం.

- మధు,ఇరిగేషన్ ఏఈ