డిజిటల్‌లో డీలా..!
కేంద్రం విడుదల చేసిన పీజీఐ-డీ నివేదికలో వెల్లడి
ప్రచేష్ట-1 గ్రేడ్లోనే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు
డిజిటల్ విద్య, అభ్యాస ఫలితాలు పెరిగితేనే ‘ఉత్తమ్’ గ్రేడ్కు ఛాన్స్
కట్టంగూర్, ఆగస్టు 4 : పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యాబోధన అద్భుతంగా ఉంది.. విద్యాశాఖ పర్యవేక్షణ, పాలనా ప్రక్రియల నిర్వహణ శభాష్ అనిపిస్తోంది.. విద్యార్థుల రక్షణకు కొదవ లేదు.. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యను అందించడంలో, విద్యార్థుల అభ్యాస నాణ్యతా ప్రమాణాలను పెంచడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వెనుకబడిపోతోందనీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తుంది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ ఇటీవల విడుదల చేసిన ‘జిల్లాల పాఠశాల విద్య పనితీరు సూచిక’ నివేదిక ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్య ప్రమాణాలను మదింపు చేస్తూ విడుదల చేసిన ఈ నివేదికలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల సమగ్ర పనితీరును వెలుగులోకి వచ్చింది.
ప్రచేష్ట-1 గ్రేడ్లో ఉమ్మడి నల్లగొండ..
మొత్తం 600 మార్కులకు గానూ నిర్వహించిన ఈ మూల్యాంకనంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడూ జిల్లాలు‘ప్రచేష్ట-1’ గ్రేడ్ను సాధించాయి. యాదాద్రి భువనగిరి 363 మార్కులతో ఉమ్మడి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 358 మార్కులతో నల్లగొండ రెండో స్థానంలో, 346 మార్కులతో సూర్యాపేట మూడో స్థానానికి పరిమితమయ్యింది. అదే సమయంలో రాష్ట్రంలో హైదరాబాద్ (409), మేడ్చల్-మల్కాజ్గిరి (402), రంగారెడ్డి (395) జిల్లాలు ‘ఉత్తమ్-3’ గ్రేడ్తో అగ్రస్థానంలో నిలవగా.. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఈ మూడు జిల్లాలు తర్వాతి శ్రేణిలో నిలిచాయి.
ఈ అంశాల్లో కొంత బెటర్..
తరగతిగది బోధన విషయంలో ఇలా.. : తరగతి గది బోధన విషయంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, తరగతి నిర్వహణ విభాగంలో (90 మార్కులకు) నల్లగొండ (72/90), యాదాద్రి భువనగిరి (70/90) జిల్లాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. రాజధాని హైదరాబాద్ (73/90) స్కోరుకు దాదాపు సమీపం లో నిలిచి తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాయి. సూర్యాపేట జిల్లా 67 మార్కులు సాధించింది.
ఇక పాలనా ప్రక్రియలు అంశానికి వస్తే.. విద్యాశాఖ పర్యవేక్షణ, నిధుల వినియోగం, పరిపాలన విభాగంలో (84 మార్కులకు) యాదాద్రి భువనగిరి (65/ 84), నల్లగొండ (64/84) జిల్లాలు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలోనే అగ్ర శ్రేణి జిల్లాల సరసన నిలిచాయి. మరోవైపు పాఠశాల భద్రత చూస్తే.. పాఠశాలల్లో పిల్లల భద్రత, రక్షణ చర్యల నిర్వహణలో 35 మార్కులకు గానూ యాదాద్రి భువనగిరి 32, నల్లగొండ 28, సూర్యాపేట 28 మార్కులతో మంచి స్కోరు సాధించడం గమనార్హం.
డిజి‘డల్’ విద్య!
పీజీఐడీ నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు ’ఉత్తమ్’ గ్రేడ్కు చేరుకోకపోవడానికి అడ్డంకులు లేకపోలేదు. ప్రధానంగా డిజిటల్ విద్యలో వెనుకబాటే. డిజిటల్ విద్య కేటాయించిన 50 మార్కులకు గానూ నల్లగొండ (19), యాదాద్రి (19), సూర్యాపేట (18) అత్యంత తక్కువ మార్కులు పొందాయి. హైదరాబాద్ (31), మేడ్చల్ (30)లతో పోలిస్తే గ్రామీణ పాఠశాలల్లో ఐసిటి ల్యాబ్లు, కంప్యూటర్లు, ఇంట ర్నెట్ సదుపాయాలు, స్మార్ట్ క్లాస్రూమ్లు చాలా పరిమితంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.
మరోవైపు అభ్యాస నాణ్యతా ఫలితాల్లో మొత్తం 290 మార్కులకు గానూ సూర్యాపేట (151), యాదాద్రి (148), నల్లగొండ (147) స్కోర్లు మాత్రమే సాధిం చాయి. ఉపాధ్యాయులు బాగానే బోధిస్తున్నప్పటికీ, విద్యార్థుల్లో కనీస గణిత, భాషా సా మర్థ్యాలు, ప్రాథమిక అక్షరాస్యత ఆశించిన స్థాయిలో లేవని మూల్యాంకనం తేల్చింది. దీంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాల విభాగంలో (51 మార్కుల కు) యాదాద్రి (29), నల్లగొండ (28), సూర్యాపేట (28) సగటు స్థాయికే పరిమితమయ్యాయి. తాగునీరు, మరుగుదొడ్లు, గ్రం థాలయాలు, ఆటమైదానాల వసతులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందనేది స్పష్టమవుతోంది.
చక్కదిద్దుకుంటేనే ఫలితం.. :
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యా వ్యవస్థకు బలమైన ఉపాధ్యాయ బృందం, చక్కటి పాలనా యంత్రాంగం అండగా ఉన్నప్పటి కీ... డిజిటల్ మౌలిక సదుపాయాల కొరత, విద్యార్థుల ప్రాథమిక అభ్యాస నాణ్యతా లోపాలు పురోగతికి అడ్డంకిగా మారాయి. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్‌ఆర్ సా యంతో ప్రతి పాఠశాలకు డిజిటల్ పరికరా లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి, విద్యార్థుల ప్రాథమిక పునాది రాత, పఠన, గణన సామర్థ్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఉమ్మడి జిల్లా ‘ప్రచేష్ట’ స్థాయి నుంచి రాష్ట్రంలో ‘ఉత్తమ్’, ‘ఉత్కర్ష్’ స్థానాలకు చేరుకోలేదు.






