5 August, 2026 | 1:53 AM

మసాలాల్లో విషం!

05-08-2026 01:09 AM
  1. కెమికల్స్ కలిపి ప్రజారోగ్యంతో చెలగాటం 
  2. హైదరాబాద్‌లోని 13సంస్థల్లో ‘హెచ్-ఫాస్ట్’ తనిఖీలు 
  3.   25 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం 
  4. కల్తీదారులపై కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

సికింద్రాబాద్ ఆగస్టు 4 (విజయక్రాంతి): విషపూరిత కెమికల్స్ ఉపయోగించి మసాలా దినుసులు తయారు చేస్తున్న ముఠాల గుట్టు ను   హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్) రట్టు చేశారు. నగరంలోని 13 మసాల వ్యాపార సంస్థలు, ప్రాసెసింగ్ కేంద్రాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా కల్తీ మసాలాలు, వాటి తయారీకి సిద్ధంగా ఉంచిన ముడి పదార్థాలను స్వాధీ నం చేసుకున్నారు.

కల్తీ మసాలాల నాణ్యత పెంచేందుకు సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్, బట్టల డైలు, టాల్కమ్ పౌడర్, రైస్‌బ్రాన్ ఆయిల్ వంటి హానికరమైన పదార్థాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు. హెచ్-ఫాస్ట్ బృందం ఆధ్వర్యంలో  అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 140 రోజుల్లో 202 కేసులు నమోదు చేశారు. దాదాపు 2.46 లక్షల కిలోల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో కల్తీ మసాలా దినుసులు 25.3 టన్నులు, 6,700 కిలోల జీలకర్ర, 2,350 కిలోల జీలకర్ర పొడి, 4,960 కిలోల ఆవాలు, 2280 కిలోల షాజీరా, 550 కిలోల లవంగాలు, 254 కిలోల సోంపుతో పాటు అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం, పనీర్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఊరగాయలు, టీ పొడి, వాటర్ ప్లాంట్‌ల ద్వారా విక్రయించే తాగునీటిలో టైటానియం ఆక్సెడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ముగ్గురి అరెస్ట్, క్రిమినల్ కేసులు నమోదు

ఆయా సంస్థల నుంచి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. కల్తీ మసాలాల తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ దారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ (బీఎన్‌ఎస్) 110 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ ఆహారపద్దార్థాలపై ఉక్కుపాదం మోపు తామని స్పష్టం చేశారు.

‘హెచ్-ఫాస్ట్’రికార్డు రికవరీలు

ఆహార పదార్థాలను కల్తీ చేసే సంస్థల పునాదులు కదిలించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘హెచ్-ఫాస్ట్’ బృందం రికార్డు స్థాయిలో తనిఖీలు నిర్వహించిందని సీపీ వెల్లడించారు. 140 రోజుల వ్యవధిలోనే 2.46 లక్షల ఆహారపదార్థాలను స్వాధీనం చేసుకుందన్నారు. హెచ్-ఫాస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు కూడా తనిఖీలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు.