5 August, 2026 | 1:50 AM

పంచాయతీలకు షాక్!

05-08-2026 12:59 AM
  1. 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ విద్యుత్ బకాయిలకే 
  2. కరెంట్ బిల్లుల రశీదు చూపిస్తేనే జీపీ నిధులు విడుదల
  3. కొత్త నిబంధనతో సర్పంచ్‌ల ఆందోళన  
  4. నిధుల్లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తం 
  5. మౌలిక వసతుల కల్పనకు తిప్పలు
  6. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,700 కోట్ల విద్యుత్ బకాయిలు 

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీల అభివృద్ధికి విద్యుత్ బకాయిలు అడ్డంకిగా మారాయి. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మౌలిక వసతుల కల్పన, ప్రజావసరాలకు కాకుండా, విద్యుత్ బకాయిలకే మళ్లుతున్నాయి. ముందుగా కరెంట్ బిల్లులు చెల్లించి రశీదులు సమర్పించిన తర్వాతే మిగిలిన నిధులను ఇతర పనులకు వినియోగించాలన్న నిబంధనలు సర్పంచ్‌లు, కార్యదర్శులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇప్పటికే నిధుల కొరతతే సతమతమవుతున్న పంచాయతీలకు ఈ నిబంధన మరింత భారంగా మారింది. వీధి దీపాలు, మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి మోటార్లు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు తదితర ప్రజావసరాల కోసం వినియోగించిన విద్యుత్ బిల్లులు ఏళ్లుగా పేరుకుపోయాయి. రాష్ట్రంలోని 12,700కు పైగా గ్రామ పంచాయతీల్లో ఈ బకాయిలు రూ.1,700 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో భాగంగా చేపట్టాల్సిన పనులకు కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపులకే ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మౌలిక వసతుల కల్పనకు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు, కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో విద్యుత్ సంస్థల నుంచి పంచాయతీరాజ్ శాఖపై ఒత్తిడి పెరిగింది. 

పంచాయతీల మెడపై కత్తిలా నూతన నిబంధన

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్సీ) నిధులు సకాలంలో రాకపోవడంతో కేంద్ర నిధులపైనే పంచాయతీలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నూతన నిబంధన పంచాయతీల మెడపై కత్తిలా మారింది. ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లకు కూడా నిధులు డ్రా చేయడానికి అవకాశం లేకపోవడం, ముందుగా విద్యుత్ బిల్లులు సమర్పించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు.

మరోవైపు విద్యుత్ బిల్లులు చెల్లించడం పంచాయతీల చట్టబద్ధమైన బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర నిధులను స్థానిక అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉందని, అయితే విద్యుత్ బకాయిల చెల్లింపు కూడా బాధ్యత కావడంతో నిధుల మళ్లింపుగా చూడలేమని సమర్థిస్తున్నారు.  

ఉమ్మడి మెదక్‌లో రూ.150 కోట్ల బకాయిలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉండగా, విద్యుత్ బకాయిలు సుమారు రూ.150 కోట్లకు పైనే పేరుకుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు విద్యుత్ బిల్లుల బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బిల్లులను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లిస్తే తప్ప.. మిగతా నిధులను డ్రా చేసేందుకు అనుమతించబోమనే కండీషన్ పెట్టడం చర్చనీయంశమైంది. పాత విద్యుత్ బకాయిలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం, లేదా వాయిదాల పద్ధతిలో మినహాయింపు ఇవ్వకపోతే  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పాలన స్తంభించిపోయే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

సిబ్బందికి అందని వేతనాలు 

15వ ఆర్థిక సంఘం నిధులను మురుగు కాలువల క్లీనింగ్, బ్లీచింగ్ పౌడర్, వీధి దీపాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉండగా, విద్యుత్ బకాయిలకు మళ్లించాల్సి రావడంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జీపీల ఖాతాల నుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేసే అవకాశం లేకుండాపోయింది. కనీసం పల్లె ప్రగతి ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించే పరిస్థితి లేదు. గత కొద్ది నెలలుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా అందడం లేదని సమాచారం.

దీనికి తోడు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే గ్రామ పంచాయతీ కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత తాజా ఆంక్షల నేపథ్యంలో నర్సాపూర్, చేగుంట, మనోహరాబాద్, గజ్వేల్, జహీరాబాద్ పరిధిలోని సర్పంచుల సంఘాల మాజీ ప్రతినిధులు, కార్యదర్శులు ఆందోళన బాట పట్టారు. పంచాయతీల సొంత ఆదాయం సిబ్బంది జీతాలకే చాలడం లేదని, ఇలాంటి తరుణంలో కోట్ల రూపాయల బకాయిలను కట్టమనడం పల్లెలను చీకట్లోకి నెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.