5 August, 2026 | 1:53 AM

కొండపోచమ్మలో కదలిక!

05-08-2026 01:11 AM
  1. రిజర్వాయర్ నిర్మాణంలో రూ.2,898 కోట్ల అక్రమాలు
  2. లోతైన విచారణకు విజిలెన్స్ నిర్ణయం
  3. ఏసీబీ దర్యాప్తునకు సిఫారసు
  4.    11 నెలల తర్వాత ప్రభుత్వానికి ఫైల్  
  5.    30 మంది అధికారులపై చర్యలకు సూచన
  6. కాంట్రాక్టర్ల నుంచి నిధుల రికవరీకి కూడా..
  7. సర్కార్ చర్యలపైనే అందరి దృష్టి

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : దాదాపు 11 నెలల నిరీక్షణకు తెరపడింది. కొండపోచమ్మసాగర్ నిర్మాణం, నీటి ఎత్తిపోతల విధానంలో అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఫిర్యాదులపై లోతైన దర్యాప్తు అవసరమని తేల్చి చెప్పింది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

కాగా తదుపరి చర్యలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో, అలాగే రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే విధానంలో మార్పులు చేయడం వల్ల సుమారు రూ. 2,898 కోట్ల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. అప్పటి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారధ్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, కొండపోచమ్మసాగర్ నిర్మాణాన్ని పరిశీలించారు.

రిజర్వాయర్ బండ్‌ను ఏ మట్టితో నిర్మించారు, మట్టిని ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి, అందుకు బాధ్యులను కూడా గుర్తించి జాబితా తయారచేశారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పలు సిఫారసులతో కూడిన పూర్తిస్థాయి నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గతేడాది  ఆగస్టులో విజిలెన్స్ కమిషన్‌కు పంపించింది. 

11 నెలలుగా కమిషన్ వద్దే ఫైల్

విజిలెన్స్ విభాగం అధికారులు లోతుగా విచారణ చేసి, అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించించి అక్రమాల నిగ్గుదేల్చారు.  రూ. 2898 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్టుగా వాస్తవాలను పొందుపర్చి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు వీ అండ్ ఈ డీజీ కార్యాలయానికి పంపారు. సాంకేతికంగా.. విజిలెన్స్ కమిషన్ వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.

అయితే కొండపోచమ్మసాగర్‌పై వచ్చిన దస్త్రాన్ని పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి విజిలెన్స్ కమిషన్‌కు సుమారు 11 నెలల కాలం పట్టడం గమనార్హం. ఎట్టకేలకు జూలై చివరి వారంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేసిన సిఫారసులనే యధాతథంగా పంపిస్తూ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం.

బాధ్యులుగా 30 మంది ఇంజనీర్లు, అధికారులు 

కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నిర్మాణం, అందులోకి నీటిని ఎత్తిపోసే విధానంలో మార్పువల్ల సుమారు రూ. 2898 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడానికి బాధ్యులుగా సుమారు 30 మంది ఇంజనీర్లు, అధికారులను విజిలెన్స్ కమిషన్ గుర్తించి, వారిపై వివిధ రకాల చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేసినట్టు సమాచారం. ఇలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఇంజనీర్ల జాబితాలో.. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఒకప్పటి ఈఎన్‌సీతోపాటు సాగునీటి సలహాదారుగా వ్యవహరిస్తున్న రిటైర్డు అధికారి సహా సుమారు 30 మంది ఇంజనీర్లు, అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది.

అధికారులు, ఇంజినీర్లు కుమ్మక్కై బిల్లుల తయారీ

కొండపోచమ్మసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న కాంట్రాక్టు సంస్థల నుంచి భారీ మొత్తంలో రికవరీ చేయాలంటూకూడా విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసినట్టుగా సమాచారం. ఇందులో ఒక కాంట్రాక్టు సంస్థ నుంచి రూ. 60 కోట్లు, మరో కాంట్రాక్టు సంస్థ నుంచి రూ. 70 కోట్ల వరకు రికవరీ చేయాలంటూ సూచించినట్టు తెలుస్తుంది.

రిజర్వాయర్ బండ్ నిర్మాణంలో వాడిన మట్టిని దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టుగా కాంట్రాక్టు సంస్థలు, అధికారులు, ఇంజనీర్లు కలిసి బిల్లులు తయారు చేసినట్టుగా విజిలెన్స్ విభాగం గుర్తించింది. వాస్తవానికి బండ్ నిర్మాణానికి వాడిన మట్టిని అదే రిజర్వాయర్‌లో తవ్వి తీసినట్టుగా నిగ్గు తేల్చారు.

అందుకే కొందరు ముఖ్యమైన ఇంజనీర్లు, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దీనికంటే ముందుగా.. ఈ అక్రమాలు, అవినీతి కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అప్పగించి లోతుగా విచారణ చేయించాలనికూడా సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది. విజిలెన్స్ విభాగం సూచించిన అన్ని సిఫారసులను యధాతథంగా ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ కమిషన్ నివేదిక, సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడమే మిగిలింది.