ఆ ఊర్లో.. ఆడపిల్ల పుడితే రూ.5000
వినూత్న కార్యక్రమానికి అనంత్‌పేట సర్పంచ్ శ్రీకారం
నిర్మల్, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు.. ఆడబిడ్డ పుడితే ఆ ఇం టికి సంతోషమే కాదు.. ఆ ఊరికే ఆనందం కలగాలని భావించారు ఆ గ్రామ సర్పంచ్.. ప్రభుత్వం అందించే సాయంతో పని లేకుండా తన సొంత డబ్బులతో ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు నిర్మల్ గ్రామీణ మండలం అనంత్ పేట సర్పంచ్. మా ఊరి బంగారు తల్లి అనే పథకాన్ని ప్రవేశ పెట్టా రు. ఆ ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే.. ఆ పాప పేరు మీద బ్యాంకులో రూ. 5వేలు జమ చేయనున్నారు.
ఆ తర్వాత ప్రతినెల ఆయా పిల్లల తల్లి దండ్రులు జమ చేసుకునేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో భవిష్యత్తులో ఆడ పిల్లల ఉన్నత చదువులు.. పెళ్లిళ్లకు బ్యాంకులో జమ అయిన డబ్బులు పనికొస్తాయి. తల్లి దండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉంటుంది. తాజాగా డా. బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ మాదస్తు సునీత ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ గ్రామానికి చెందిన కుంటాల శ్రావణి రాంచందర్ దంపతుల కూతురు స్మృతి పేరిట రూ. 5వేల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆదర్షంగా నిలిచారు. నగదుతో పాటు రెండు శ్రీగంధం చెట్లను బహుమతిగా అందించారు. సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు.






