పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు
జైనూర్, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): జైనూర్ మండలంలో పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు పలు కిరాణా దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు.
ఎస్‌ఐ గోదరి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గోపాల్ కిరాణా షాప్ యజమాని బాతనే గోపాల్, శ్రీ రాజేశ్వర కిరాణా షాప్ యజమాని ముత్యాలువార్ రమేష్, జనతా కిరాణా షాప్ యజమాని తౌఫీక్ బడ్వాని రేషన్ కార్డు దారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలలో గోపాల్ కిరాణా షాప్ నుండి 40 క్వింటాళ్లు, రాజేశ్వర కిరాణా షాప్ నుండి 13 క్వింటాళ్లు, జనతా కిరాణా షాప్ నుండి 11 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా జనతా కిరాణా షాప్ నుండి 130 కిలోల బెల్లం, 92 కిలోల పటికను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, నిల్వ లేదా విక్రయం చేయడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.






