11-11-2025 12:00:00 AM
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, నవంబర్ 10 (విజయ క్రాంతి): ప్రజాకవి, జానపద వాగ్గేయకారుడు అందెశ్రీ మృతి తెలంగాణ జాతికి తీరని లోటని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెసు పార్టీ ఆద్వర్యంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అందెశ్రీ చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ..
జననీ జయ కేతనం తోపాటు ఆయన రాసిన పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించాయన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సాహితీ వేత్తగా, సమాజానికి మాయ మై పోతున్నడమ్మా... మనిషన్నవాడు అని పాటలో అంతరించి పోతున్న మానవ విలువలకు అద్దం పట్టేలా రాసి సమాజాన్ని మేలు కొలుపారన్నారు.
అందెశ్రీ రాసిన జయ జయహే గీతాన్ని సి ఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా ప్రకటించారన్నారు.అందెశ్రీ కి 2014 లో రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ కోసం ప్రతిపాదించినప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని,అందెశ్రీ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, పద్మశ్రీ అవార్డ్ ప్రకటింప చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని జీవన్ రెడ్డి కోరారు.