టెర్రర్ లింక్స్..12 మందిని అరెస్టు చేసిన పోలీసులు
అమరావతి: ఉగ్రవాద సంబంధాలున్నాయనే(Terror Links) అనుమానంతో పలు రాష్ట్రాల్లో సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో 12 మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh Police) అరెస్టు చేశారు. అనుమానితులను అరెస్టు చేసేందుకు బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రత్యేక బృందాలను మోహరించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్‌గా గుర్తించారు. వీరందరూ విజయవాడ నగర నివాసులు. ఈ ముగ్గురూ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడం, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలను సమన్వయం చేయడంలో పాలుపంచుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు భారత ఉపఖండంలోని అల్-ఖైదా (AQIS) ఇరాక్, సిరియా ఇస్లామిక్ స్టేట్ (ISIS) లతో సంబంధం ఉన్న విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ, దేశ వ్యతిరేక లక్ష్యాల కోసం పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.




