29 July, 2026 | 1:19 PM

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం: కలెక్టర్ అంకిత్

29-07-2026 12:45 PM

రానున్న 36 గంటల్లో భారీ వర్షాల అవకాశం 

అన్ని శాఖల అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 29, (విజయక్రాంతి): రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి, భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమ కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వరద ప్రవాహం సమయంలో నదులు, వాగులు, కాలువలు, చెరువులు వంటి జలవనరుల వద్దకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు.  రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత తాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ అన్నారు . గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రసవ సమయం సమీపించిన గర్భిణీలను ముందుగానే సమీప ఆసుపత్రులు లేదా గర్భిణీ వసతి కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.