చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు
బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి...
బాన్సువాడ, జూలై 29 (విజయక్రాంతి): చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవనీ బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి(Banswada DSP Vittal Reddy) హెచ్చరించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బ లో బుధవారం ఉదయం బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ వందలాది మంది పోలీసు సిబ్బంది కాలనీలోకి ప్రవేశించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కార్డెన్ సర్చ్‌లో భాగంగా రాజారాం దుబ్బ ప్రాంతంలోని ప్రధాన రహదారులు, కాలనీకి వెళ్లే మార్గాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కాలనీని పూర్తిగా చుట్టుముట్టిన పోలీసులు ఇళ్ల వరుసల్లో, రోడ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని కొన్ని వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేశారు. అదే సమయంలో కాలనీలోని దుకాణాలు, ఇళ్లను కూడా పోలీసులు తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను విచారించారు.ఈ సందర్భంగా డీఎస్పీ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి మాదకద్రవ్యాలు వంటి సామాజిక రుగ్మతలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవించాలని కోరారు.
నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కాలనీకి మంచి పేరు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేరస్తుల కదలికలను గుర్తించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ తుల శ్రీధర్, ఎస్ఐలు, కానిస్టేబు లు సిబ్బంది పాల్గొన్నారు.






