16 May, 2026 | 3:00 PM

అంజలీదేవి రెండు పాత్రల్లో మెప్పించిన చిత్రం

16-02-2025 12:00 AM

1951, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు జానపద చిత్రం ‘తిలోత్తమ’. మీర్జాపురం రాజా స్వీయ దర్శకత్వంలో శోభనాచల పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు, సూర్యప్రభ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా.. తాపీ ధర్మారావు మాటలు, పాటలు అందించారు.

దీనికి అంజలీదేవి భర్త ఆదినారాయణరావు సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమా కథ ఏంటంటే.. వసంతసేన (సూర్యప్రభ) ఓ వేశ్య. తిలోత్తమ (అంజలీదేవి) దేవలోకపు అప్సరస. ఈమె అంశతోనే భూలోకంలో పుట్టిన తిలోత్తమ (అంజలీదేవి) ఓ రాజకుమారి. ఈ ముగ్గురూ పూలమాలలు కట్టుకుని జీవించే దేవదత్తుడు (అక్కినేని నాగేశ్వరరావు) అనే అందగాడిని ప్రేమిస్తారు.

స్వర్గలోకంలోని తిలోత్తమ ఇంద్రజాలానికీ, ఆమెను ప్రేమించిన గంధర్వుడి శాపానికీ గురవుతాడు దేవదత్తుడు. గంధర్వుడి శాపం ఫలితంగా స్వర్గలోక తిలోత్తమ, దేవదత్తుడు కిరాతక రూపాలు ధరించి తమ జన్మవృత్తాంతాలను మరిచిపోయి ఉంటారు.

అలాంటి పరిస్థితిలో దేవదత్తుడు తన భార్య కిరాతకు వంధ్యత్వం పోగొట్టే నేపథ్యంలో తన కారణంగా భూలోక తిలోత్తమకు కలిగిన బిడ్డను కాళికి బలి ఇస్తాడు. దీంతో కాళి ప్రత్యక్షమై అందరి కష్టాలు కడతేర్చి బిడ్డను బతికిస్తుంది. స్వర్గలోక తిలోత్తమ స్వర్గానికి పోగా, దేవదత్తుడు భూలోక తిలోత్తమ, వసంతసేనతో కలిసి జీవిస్తాడు. అలా కథ సుఖాంతం అవుతుంది.