16 May, 2026 | 3:57 PM

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించాలి

16-02-2025 12:00 AM

బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. నూతన దర్శకుడు ఆర్‌వీసీ నిఖిల్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ క్రమంలో శనివారం చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడని గౌతమ్‌ను మెచ్చుకుంటుంటే తండ్రిగా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాను, మంచి పాత్రను చేశాననే సంతృప్తి కలుగుతోంది.

ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే గొప్ప అంశాలేమీ ఇందులో లేవు. నేను, వెన్నెల కిషోర్, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, నా కొడుకు రాజా గౌతమ్ మాత్రమే ఉన్నాం. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు కాకుండా రంగమార్తాండ లాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నా. డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి.

నా మీద ప్రేమతో యంగ్ దర్శకులు వచ్చి.. ఒక్క రోజు పాత్ర ఉంది.. చేయండి సర్ అని అడుగుతుంటారు. అలా చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా.. వాళ్లకు ఉపయోగపడుతుంది కదా! అని నేను చిన్న పాత్రల్ని అయినా చేస్తున్నా’ అన్నారు. హీరో రాజాగౌతమ్ మాట్లాడుతూ.. ‘మా నాన్న ఇంట్లోనూ నాతో సరదాగా ఉంటారు.

స్క్రీన్ మీదకు వచ్చేసరికి చాలా సీరియస్‌గా ఉండేది. మా నాన్న ఎప్పుడూ మా మీద ఒత్తిడి పెంచలేదు. అన్నీ మా నిర్ణయాలకే వదిలేస్తుంటారు’ అని చెప్పారు. నిర్మాత రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను నిర్మించిన గత చిత్రాలు మంచి మౌత్ టాక్‌తోనే హిట్ అయ్యాయి.

ఈ మూవీకీ అలాంటి టాక్ వచ్చింది’ అని తెలిపారు. డైరెక్టర్ నిఖిల్ మాట్లాడుతూ.. “బ్రహ్మా ఆనందం’ థియేటర్‌కు వెళ్లి ఆడియెన్స్‌తో కలిసి సినిమాను చూశాం. మేం ఊహించని సీన్లలో కూడా నవ్వుతున్నారు” అన్నారు. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.