calender_icon.png 4 February, 2026 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై మరో కమిషన్

04-02-2026 02:13:51 AM

ఆసలు సూత్రధారులను కనుగొనేందుకు ఏపీ క్యాబినేట్ నిర్ణయం

అమరావతి, ఫిబ్రవరి ౩: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం కల్తీ నెయ్యి నివేదికపై కేబినేట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినేట్ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

అలాగే నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంపైనా కేబినేట్ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు చర్చించారు. సిట్ విచారణ, చార్జిషీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై అధ్యయనం చేసి అసలు సూత్రధారులను, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ కమిషన్ ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను తొలగించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కేబినెట్ తెలిపింది.