04-02-2026 02:14:42 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రెబల్స్ బెడద ఉన్నచోట వారికి నచ్చజెప్పాలని, నామినేటెడ్ పదవుల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి పోటీ నుంచి తప్పుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఓట్లు చీలొద్దని, మంత్రులందరూ జిల్లా లో పాగా వేసి పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌తో కలిసి మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన అనేక సర్వేలు కాంగ్రెస్‌దే పైచేయి అని చెబుతున్నాయని, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలుంటే, వాటిని స్థానికంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు.
వెనకబడిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా స్థానాల్లో పక్కా విజయం సాధించేలా కార్యాచరణను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, స్థానికంగా పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తన కు నివేదించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, పాత, కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని ఉద్బోధించారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి, సమష్టిగా పనిచేయాలని సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్నారు.
గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో పార్టీ శ్రేణులు ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డి, సంజయ్ ఇకనైనా తమ మధ్య విభేదాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. సమావేశంలో సీఎం, మంత్రులు బీసీ రిజర్వేషన్ల అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. జనరల్ స్థానా ల్లో బీసీలకూ బీఫాం ఇవ్వాలని సీఎంని కోరినట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జిల్లాల పర్యటనలో ఉండటంతో స మావేశానికి రాలేదని, వారితో తాను నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లు సీఎం తెలిపారు. స మావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహ రి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏ పార్టీతో మాకు పొత్తు లేదు: పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్
మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఏ పార్టీతో పోటీ లేదని, సొంతంగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సీఎం సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులందరూ జిల్లాల్లోనే ఉండి, కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. తమ పార్టీకి రెబల్స్ బెడద లేదని, అన్ని చోట్ల వారు విత్‌డ్రా అయ్యారని వివరించారు.
నేడు మిర్యాలగూడకు సీఎం..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో పర్యటించనున్నారు. ముందుగా 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.