ఢిల్లీలో మరో నిర్భయ ఘటన
కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక దాడి
పని నుంచి ఇంటికి వెళ్తుండగా బాధితురాలిని బస్సులోకి లాగిన దుండగులు
డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
న్యూఢిల్లీ, మే 14: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి నిర్భయ తరహా ఘటన చోటుచేసుుకుంది. ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతం లో ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పితంపుర మురికివాడలో నివసించే బాధితురాలు మంగోల్పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది.
ఈ నెల 11న రాత్రి పని ముగించుకుని ఆమె ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. రాత్రి సమయం కావడంతో సరస్వతీ విహార్ సమీపంలోని బస్టాప్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు వద్దకు వెళి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని టైమెంత అని అడిగింది. సమయం అడిగిన పాపానికి ఆ దుండుగులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. అనంతరం బస్సును నంగ్లోయ్ వైపు నడుపుకుంటూ వెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో బస్సును ఆపి, డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బస్సు నాంగ్లోయ్ మెట్రో స్టేషన్ సమీపంలో దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు గంటల పాటు తిరిగిందని తెలిపింది. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో దుండుగులు ఆ మహిళను బస్సు నుంచి తోసేసి అక్కడ నుంచి పరారైనట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు రాణిబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఉమేశ్, రాజేంద్రగా గుర్తించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించాయి. సంఘటనకు ఉపయోగించిన బిహార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెనిక్స్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలకి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీపార్టీ తీవ్ర విమర్శలు చేసింది.






