15 August, 2026 | 3:06 AM

ఘనంగా 26వ గ్రాడ్యుయేషన్ డే

15-08-2026 01:20 AM

బాచుపల్లి గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహణ 

హైదరాబాద్, ఆగస్టు 14(విజయక్రాంతి): బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కళాశాలలో 26వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ. దామోదరం, న్యూరియల్మ్ సంస్థ ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ హెడ్ డాక్టర్ టి. శైల కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ దామోదరం మాట్లాడుతూ వ్యక్తులు, సమాజాలు, దేశాల అభివృద్ధిలో విద్య ఎల్లప్పుడూ గొప్ప ఉత్ప్రేరకంగా నిలుస్తుందని అన్నారు.

ప్రతి గ్రాడ్యుయేట్ శ్రేష్ఠత, ఆవిష్కరణ, నాయకత్వం, సమాజ సేవ, మానవ సేవలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.మరో ముఖ్య అతిథి డా. టి. శైల కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత తరం పట్టభద్రులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని రాణించాలంటే జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వంటి సరికొత్త సాంకేతికతల్లో ప్రావీణ్యం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కళాశాలలోని ప్రతి విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్ మెడల్స్ను బహుకరించారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులం దరికీ పట్టాలను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్, కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.