15 August, 2026 | 1:03 AM

విషపూరితమవుతున్న మిరాలం చెరువు

15-08-2026 12:15 AM

రోగాల బారిన అన్నోజిగూడ ప్రజలు!

నేరుగా చెరువులోకి అపార్ట్మెంట్ల మురుగు నీరు!

బోరు బావుల్లోనూ కలుషిత నీరే..

స్పందించని అధికారులు, మండిపడుతున్న స్థానికులు!

ఘట్‌కేసర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ ప్రజలకు గుండెకోత మిగులుస్తోంది మిరాలం చెరు వు! ఒకప్పుడు స్వచ్ఛమైన నీటికి నిలయంగా ఉన్న ఈ చెరువు, నేడు అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల బాధ్యతారాహిత్యంతో మురుగు గుంటలా మారిపోయింది.

చుట్టుపక్కల వెలిసిన కొత్త అపార్ట్మెంట్లు, టౌన్షిప్ల నుంచి దగ్గర లో ఉన్న హాస్పటల్ వ్యర్థాలు శుద్ధి చేయకుండానే నే రుగా చెరువులోకి వదిలేస్తున్నారు. నామ్కే వాస్తేగా మారిన ఎస్టిపి (సెవెంజ్ ట్రీ ట్ మెంట్ ప్లాంట్) వ్యవస్థలతో విషరసాయనాలు, మురుగునీరు చెరువులో కలిసిపో తున్నాయి. దీనికితోడు పండగల పేర్లు చెప్పి చెరువు చుట్టూ మట్టిని నింపి కబ్జాలకు పా ల్పడుతుండటంతో చెరువు ఉనికి ప్రమాదంలో పడింది.

చెరువు నుంచి వెలువడుతున్న తీవ్ర దుర్గంధంతో అన్నోజిగూడ వాసులు ఇళ్లలో ఉండలేక, తలుపులు తీయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. చెరువు కలుషితం కావడంతో భూగర్భ జలాలు కూడా విషపూరితమైపోయాయి. పరిసరాల్లోని బోరు బావుల నుంచి ఆ చెరువుకు చుట్టూ ఉన్న ఇళ్లల్లో బోర్లలో నుండి వస్తున్న నీరు నల్లటి, దుర్గంధభరితమైన నీరు వస్తుండటంతో తాగునీటికే కాదు వాడకానికి కూడా పనికిరాకుండా పోయాయి.

గతంలో పాలకులు, అధికారుల చుట్టూ తిరిగినా హామీలు తప్ప పరిష్కారం దక్కలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ప్రజాపాలకులు అధికారం వారి చేతిలో ఉన్నప్పుడు పండుగ పేర్లు చెప్పి ఇష్టానుసారంగా చెరువులను కబ్జా చేసి చెరువుల విస్తీర్ణను కుదించి వేసేశారు.

ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి మౌనిక చుట్టుపక్కల అపార్ట్ మెంట్ల నుండి వచ్చి మిరాల చెరువులో కలుస్తున్న వ్యర్థ పదార్థాలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామని మళ్ళీ పాత హామీలనే నెమరువేశారని, ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులారా  ఇకనైనా కళ్ళు తెరవండని అపార్ట్మెంట్ల నుంచి వస్తున్న మురుగునీటికి అడ్డుకట్ట వేసి, ఎస్టిపి (మురుగునీటి శుద్ధి కర్మాగారం) లను వెంటనే పునరుద్ధరించి, చెరువు కబ్జాలను అరికట్టి, మిరాలం చెరువును యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహ జ్వాలలకు సమాధానం చెప్పుకోక తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.