కర్ణాటకలో మరో ట్విస్ట్
40 మందికి పైగా డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేల రహస్య భేటీ
బెంగళూరు, ఫిబ్రవరి 27: కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు సెగలు మళ్లీ రాజుకున్నాయి. శివకుమార్ వర్గానికి చెందిన కొందరు తాజాగా బెంగళూరులోని ఒక ప్రైవేట్‌హోటల్లో విందు ఏర్పాటుచేశారు. సుమారు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. శివకుమార్‌ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని వీరంతా పట్టుబడుతున్నారు.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ మళ్లీ గెలవాలంటే నాయకత్వ మార్పు తప్పదని ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ గందరగోళానికి కాంగ్రెస్ హైకమాండ్ త్వరగా తెరదించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 6 నుంచి కర్ణాటక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోపే మరోసారి సమావేశం కావాలని శివకుమార్ వర్గం నిర్ణయించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య ఐదేళ్ల కాలం పూర్తి చేస్తారని, అధికార పంపకాల ఒప్పందం ఏదీ లేదని ఆయన కుమారుడు యతీంద్ర కొట్టిపారేశారు. ఈ పరస్పర వాదనలతో కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది.




