ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాతే మరో వార్డు సభ నిర్వహించాలి
20వ వార్డు కౌన్సిలర్ అతెల్లి శ్రీనివాస్
గజ్వేల్,(విజయక్రాంతి): ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాతే మరో వార్డు సభ నిర్వహించాలని 20వ వార్డు కౌన్సిలర్ అతెల్లి శ్రీనివాస్ అన్నారు. గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 20వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వార్డు సభలో కౌన్సిలర్ అతెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఫోటో లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం వార్డు ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై స్పందించిన కౌన్సిలర్ మాట్లాడుతూ, వార్డు సభల్లో వచ్చిన సమస్యలను ముందుగా పరిష్కరించి, వాటి పురోగతిని ప్రజలకు తెలియజేసిన తర్వాతే మరో సభ నిర్వహించాలన్నారు. అప్పుడే ప్రజల్లో నాయకులు, అధికారుల పట్ల విశ్వాసం పెరుగుతుందన్నారు. వార్డులోని సీసీ రోడ్లపై ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయని, వాటిని సంబంధిత అధికారులు తక్షణమే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.






