25 June, 2026 | 6:00 PM

జన సంద్రంలా సాగిన మాదకద్రవ్యాల నిర్మూలన ర్యాలీ...

25-06-2026 04:48 PM

రైల్వే స్టేషన్  నుండి ప్రకాశం స్టేడియం వరకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

విద్యార్థులు మాదక ద్రవ్యాలు,కు దూరంగా ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్  రాజు...

కొత్తగూడెం జూన్ 25 విజయక్రాంతి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో, గురువారం నాడు మాదకద్రవ్యాల నిర్మూలన   అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో  స్థానికులు,విద్యార్థులు,ప్రజాప్రతినిదులు,పుర ప్రముఖులు తదితరులు బారీ సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం రోజున  జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో  మాదక ద్రవ్యాల, నిర్మూలన సదస్సు అట్టహాసంగా జరిగింది.​

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువతను, విద్యార్థులను మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కోరల నుండి రక్షించడం, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించడం.జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామాలు ముఖ్యంగా విద్యా సంస్థలు,కళాశాలల్లో పోలీసు అధికారులు,సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు,ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.విద్యార్థులు,యువత,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధులను ఈ అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.ముందుగా ​జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకం అనేది వ్యక్తిగత సమస్య కాదని,ఇది సామాజిక రుగ్మత అని,దీనిపై పోలీసులతో పాటు ప్రతి పౌరుడు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని,  సినిమాలలోని మంచిని గ్రహించి చెడుని వదిలేయాలని, క్రీడలు,కళలు,సాంస్కృతిక కార్యక్రమాలు వంటి సానుకూల ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకుని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు..​జిల్లాను డ్రగ్స్ రహిత భద్రాద్రి గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని,డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ధైర్యంగా తమకు తెలియజేయాలని కోరారు.  

అనంతరం సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని,చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. విద్యార్థినులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు. 

అనంతర రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.  సుమారు 1500మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ పి.సి.వి.రమణ, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డిఎస్పి  సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ లు హెచ్.అబ్దుల్ రషీద్, బి.మరియధాసు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లేనినా,పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.