09-12-2025 01:12:10 PM
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
తుర్కయంజాల్: కేంద్రం ప్రభుత్వం తెచ్చిన నూతన విత్తన చట్టం ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. ఈ చట్టం ముసాయిదా పూర్తిగా రైతుల నడ్డి విరిచేలా, కార్పొరేట్ శక్తులకు కాపుకాసేలా ఉందని పద్మ మండిపడ్డారు. నూతన సీడ్స్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులకు వ్యతిరేకంగా తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్య పద్మ మాట్లాడుతూ నూతన విత్తన చట్టం బిల్ల చిన్న రైతులపై దాడి చేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విత్తన స్వావలంబనను కార్పొరేట్ శక్తులకు అప్పగించేలా ఉందన్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని, ఈ బిల్లు ద్వారా విత్తనాల ధరలను అధికంగా నిర్ణయించేలా కార్పొరేట్ కంపెనీలకు గుత్తాధిపత్యం లభిస్తుందని ఆరోపించారు. నూతన సీడ్స్ బిల్లు వల్ల రైతుల హక్కులను హరించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు బలహీనపడే అవకాశం ఉందన్నారు.
అలాగే నూతన ఎలక్ట్రిసిటీ బిల్లు వల్ల విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి విభాగాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కుట్ర చేస్తున్నారని పశ్య పద్మ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా నారాయణరెడ్డి, రైతు నాయకులు బి.ఎల్లేశ్, వి.రాము, వి.ముత్తయ్య, జి.యాదగిరి, ఎన్.పద్మ, ఎన్.సత్తమ్మ, సీపీఐ నాయకులు ఆర్.అండాలు, కె.నరేందర్ గౌడ్, ఎ.అంజమ్మ, బి.నిర్మల తదితరులు పాల్గొన్నారు.