సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రైతుల హక్కుల కోసం వడ్ల కొనుగోలులో జరుగుతున్న అక్రమ కటింగ్‌లకు వ్యతిరేకంగా పోరాడినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. 2023 ఏప్రిల్‌లో సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లాంపల్లి ఇతర ఐకెపి కేంద్రాలలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై, తాలు పేరుతో రైతులకు నష్టం చేకూరుస్తున్న విధానాలపై బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు.
మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలిచి, ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని నిర్వహించిన ఐకెపి కేంద్రాల పరిశీలన, రాస్తారోకో కార్యక్రమాలపై అప్పట్లో పోలీసులు ఐపిసి సెక్షన్ 143, 341, 149 ల కింద అక్రమంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం సుల్తానాబాద్ కోర్టుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, పెద్దపల్లి జిల్లా నాయకులు పోల్సాని సంపత్ రావు, తంగెళ్ళ రాజేశ్వరరావు, దాడి సంతోష్, ఎర్రోళ్ల శ్రీకాంత్, బెజ్జంకి దిలీప్, ఉప్పు కిరణ్, కొల్లూరి సంతోష్, ఉషణ అన్వేష్, వేగోలం మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కోర్టుల చుట్టూ తిప్పినా రైతుల శ్రేయస్సు కోసమే బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.






