09-12-2025 01:15:27 PM
హస్తం పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
ఒక్కసారి అవకాశం ఇస్తే... అభివృద్ధి చేసి చూపిస్తా: జంగయ్య
ఇబ్రహీంపట్నం: 30 ఏళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్నానని, తనకు ఒకసారి అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ సీపీఎం అభ్యర్థి చాతాళ్ల జంగయ్య అన్నారు. ఎమ్మెల్యే రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
మిత్రపక్షాల అభ్యర్థిగా కప్పపహాడ్‌లో బరిలోకి దిగానని, తన గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని జంగయ్య కోరారు. ప్రజల కష్ట, సుఖాల్లో తాను అండగా ఉన్నానని, ప్రజాసేవకుడిగా ఉన్న తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని జంగయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గరాములు, సీపీఎం గ్రామ కార్యదర్శి జంగిలి ప్రభుదాస్, గుడాల భిక్షపతి, నర్సింహా, దాసు, ఆనంద్, జ్యోతిబసు, వంశీ, యాదయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.