09-12-2025 12:54:39 PM
మనవాళ్లు డిజిటల్ వస్తులకు బందీ
మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మరొకరికి ఉపాధి
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) రెండోరోజు కొనసాగుతోంది. తొలి సెషన్ లో తెలంగాణ హెరిటేజ్, కల్చర్ ఫ్యూచర్ రెడీ టూరిజంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ హాజరయ్యారు. చర్చలో రామోజీ ఫిల్మ్ సిటీ, ఎక్స్ పీరియం ప్రతినిధులు పాల్గొన్నారు. త్రీ ట్రిలియన్ ఎకానమీ సాధనలో పర్యాటకరంగం పాత్ర కీలకమని పర్యాటక, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. ప్రస్తుత సమయంలో ఎకానమీ పెంపు అనేది అత్యవసరం అన్నారు. తెలంగాణ పర్యాటకరంగానికి మంచి రోజులు వస్తున్నాయని మంత్రి జూపల్లి తెలిపారు.
చారిత్రక, వారసత్వ సంపద గురించి చాలామందికి తెలియదన్నారు. అందరూ చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని మంత్రి కోరారు. యూరప్ లో ఖాళీ దొరికితే పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారని జూపల్లి వెల్లడించారు. మనవాళ్లు మాత్రం డిజిటల్ వస్తువులకు బందీ అవుతున్నారని సూచించారు. ఉచిత బస్సు వచ్చాక ఆలయాలకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగిందని జూపల్లి స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాలనూ సందర్శించాలని మంత్రి జూపల్లి మహిళలను కోరారు. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మరొకరికి ఉపాధి కల్పిస్తోందని ఆయన వివరించారు. ప్రభుత్వం తెచ్చిన టూరిజం పాలసీ మంచి ఇన్సెంటివ్స్ ఇస్తోందని చెప్పారు. మన చరిత్ర, సంస్కృతి, వారసత్వం వైవిధ్యభరితం అని మంత్రి జూపల్లి తెలిపారు.