కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
కొల్లూరి ఆంజనేయులు..
ఆలేరు,ఆగస్టు 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా నాయకులు కొల్లూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మోటకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు.
సుమారు గంటపాటు జరిగిన రాస్తారోకోకు సీఐటీయూ మండల కన్వీనర్ గోసంగి పరమేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డి మాండ్ చేశారు.
అలాగే మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విద్యుత్ సవరణ బిల్లు, ఆహార భద్రత చట్ట సవరణలను విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బోగారం వీరస్వామి, బైరపాక సర్వయ్య, కేసగాళ్ల రవి, నల్ల కిష్టయ్య, మారబోయిన అశోక్, గిరిబోయిన పెద్దులు, బోట్ల అరుణ, పానుగంటి లక్ష్మీ, నరసయ్య, బొట్ల మైసయ్య, పల్లె మనమ్మ, మంగళపల్లి చంద్రకళ, గడ్డం అంజయ్య, ఎల్లమ్మ, చంద్రమ్మ, సంజీవ, ఆనందు, ఉప్పలయ్య, నరసింహ, యాదమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.






