11 August, 2026 | 2:48 AM

అందినకాడికి దండుకొనుడే!

11-08-2026 01:48 AM
  1. ఇంజినీరింగ్ కాలేజీల్లో  నిర్దేశించిన ఫీజు కంటే అదనంగా వసూలు
  2. నోటీసులతోనే  సరిపెట్టుకున్న టీఏఎఫ్‌ఆర్సీ

* ఓ తండ్రి తన కూతురిని  కాలేజీలో జాయిన్ చేదామని వెళ్తే సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన తర్వాత అదనంగా రూ.28 వేలు కట్టమన్నారు. చేసేదిలేక అయన తన కూతురిని జాయిన్ చేసి వచ్చారు. పేరున్న మరో రెండు కాలేజీల్లో రూ. 8,500 చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేశారు. మరో టాప్ కాలేజీలోనైతే రూ.17,500 వసూల చేశారు. ఇంకో కాలేజీలోనైతే ఏకంగా రూ.49,900 అడిగారు. ఇవి దేనికని ప్రశ్నిస్తే అడ్మిషన్ ఫీజు, ఎన్‌బీఏ, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్‌మెంట్ చార్జెస్, యూనిఫామ్స్, బుక్ లెండింగ్ స్కీమ్ (ఆప్షనల్) అంటూ రకరకాల పేర్లు చెప్పడం గమనార్హం.

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాం తి): రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల తీరు మారడంలేదు. తమను ఎవరేంచే స్తారనే ధీమా వాటిలో తీవ్రంగా కనబడుతోంది. అందుకే రకరకాల పేర్లతో కాలేజీ ఫీజుతోబాటు  అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. సీటు పొంది రిపోర్టింగ్ కోసం కాలేజీలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు అడిగినంత కట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి.

ఉన్నవారు కడుతున్నారు..లేనివారు ఎక్కడ సీటు క్యాన్సిల్ అవుతుందోనని సమ యం అడిగి కట్టేస్తున్నారు. నింబధనల ప్రకా రం టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ అడ్మిషన్ అం డ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ) నిర్దేశించిన ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేయొద్దు. అయి తే అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టుకుంటున్నారు తప్పితే కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 

రకరకాల పేర్లతో దోపిడీ...

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రముఖ కాలేజీలు రకరకాల ఫీజుల పేరుతో రూ. 8,500 నుంచి రూ. 45 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కాలేజీలు వసూలు చేశాయి. ఎప్‌సెట్ ఫైనల్ ఫేజ్‌లో సీట్లు పొందిన కాలేజీలకు విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ కోసమని వెళ్తున్నవారిని కాలేజీల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి.

నాదర్‌గుల్‌లోని ఓ ప్రముఖ కాలేజీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్, రికగ్నైషన్ ఫీజుకు రూ.2 వేలు, ఓయూ ఇంటర్ టోర్నమెంట్ ఫీజు రూ.320, రికార్డ్స్ మ్యాన్వల్స్ ఫీజు రూ.1,500, కామన్ సర్వీసెసట్ ఫీజు రూ.1,500, రికార్డ్స్ ఇన్‌స్పెక్షన్ ఫీజు రూ.550, కాషన్ డిపాసిట్ రూ.1,000, బుక్ లెండింగ్ స్కీం రూ.1,830, స్పెషల్ సర్వీసెస్ ఫీ, యాన్వల్ కాలేజ్ ఫీ రూ.1000, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సెస్ సీఆర్టీ ఫీజు రూ.16,000 చొప్పున మొత్తం రూ.25,700 ఫీజు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదే కాలేజీ ఫీజు అధికారికంగా రూ.1,43,800. కానీ, అదనపు ఫీజు కడితేనే అడ్మిషన్ ఉంటుంది లేదంటే ఆలోచన చేసుకోండని ఇటీవల అడ్మిషన్ కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఆ కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పినట్లుగా తెలిసింది. మరో కాలేజీలో ఓ పేరెంట్ తన కూతురిని ఓ కాలేజీలో జాయిన్ చేదామని వెళ్తే సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన తర్వాత అదనంగా రూ.28 వేలు కట్టమన్నారు.

చేసేదిలేక ఆ పేరెంట్ తన కూతురిని జాయిన్ చేసి వచ్చారు. మరో పేరున్న రెండు కాలేజీల్లో రూ.8500 చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేశారు. మరో టాప్ కాలేజీలోనైతే రూ.17,500 వసూల చేశారు. ఇంకో కాలేజీలోనైతే ఏకంగా రూ.49,900 అడిగారు. ఇవి దేనికని ప్రశ్నిస్తే అడ్మిషన్ ఫీజు, ఎన్‌బీఏ, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్‌మెంట్ చార్జెస్, యూనిఫామ్స్, బుక్ లెండింగ్ స్కీమ్ (ఆప్షనల్) అంటూ రకరకాల పేర్లు చెప్పడం గమనార్హం.

 అధికారం లేదు..

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అదనపు ఫీజులు వసూలు చేసుకునే అధికారం కాలేజీలకు లేదు. దీనిపైన ఇంజినీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్సీ హెచ్చరించింది కూడా. అయినా వారి తీరు మారడంలేదు. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని కాలేజీలకు ఇటీవల నోటీసులు కూడా జారీచేసింది. ఇలా వసూలుచేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా అదనంగా వసూలు చేయరాదని స్పష్టంచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ. 2లక్షలు (ప్రతి విద్యార్థికి) వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించినా కాలేజీల తీరు మాత్రం మారడంలేదు.

నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా చాలా కాలేజీలు ఇలా వసూలు చేశాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం తమకు ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్తుండటం గమనార్హం. అటు కాలేజీలు, ఇటు అధికారుల అలసత్వం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారు.