తెలంగాణ ఆర్థికానికి జోష్!
- రూ.16.15 లక్షల కోట్లకు ఎన్‌ఎస్డీపీ
- ఏడాదిలోనే 10.8 శాతం వృద్ధి
- తలసరిలోనూ వేగం.. రూ.4,18,931కు చేరిన ఆదాయం
- కీలకంగా నిలిచిన సేవారంగం
- నిర్మాణం, వాణిజ్యంలో గణనీయమైన పురోగతి
- ఆరేళ్లలో రెట్టింపైన ఆర్థిక పరిణామం
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటలో పయనిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2025-26లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయంతో పాటు వ్యవసాయం, తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, ఇతర సేవారంగాల్లోనూ వృద్ధి నమోదైంది.
2025--26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ నికర రాష్ట్ర దేశీయోత్పత్తి(ఎన్‌ఎస్డీపీ) రూ.16.15 లక్షల కోట్లకు చేరింది. 2024--25లో ఇది రూ.14.58 లక్షల కోట్లుగా ఉండగా.. ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.1.57 లక్షల కోట్ల మేర పెరిగి దాదాపు 10.8 శాతం వృద్ధి నమోదైంది.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం కీలక పాత్ర పోషిస్తున్న విషయం తాజా గణాంకాల్లో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు, రవాణా, కమ్యూనికేషన్, ఆర్థిక సేవలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలుగా మారాయి.
ఏటేటా పెరుగుతున్న వృద్ధి ఇలా..
వాణిజ్యం, రిపేర్, హోటళ్లు, రెస్టారెంట్ల రంగం విలువ 2024--25లో రూ.2,83,799 కోట్లుగా ఉండగా.. 2025--26లో రూ.3,31,528 కోట్లకు పెరిగి ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.47,700 కోట్ల పెరుగుదల నమోదైంది. రియల్ ఎస్టేట్, గృహ యాజమాన్యం, ప్రొఫెషనల్ సర్వీసుల రంగం రూ.2,99,694 కోట్ల నుంచి రూ.3,34,688 కోట్లకు పెరిగింది.
హైదరాబాద్ సహా రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు విస్తరిస్తున్న ప్రభావం ఈ గణాంకాల్లో ప్రతిబింబిస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, ప్రసారాలకు సంబంధించిన సేవల విలువ రూ.96,233 కోట్ల నుంచి రూ.1,09,996 కోట్లకు, ఆర్థిక సేవల రంగం రూ.71,496 కోట్ల నుంచి రూ.80,183 కోట్లకు పెరిగింది. ఇతర సేవల రంగం రూ.1,18,186 కోట్ల నుంచి రూ.1,33,643 కోట్లకు పెరిగింది.
తయారీ రంగంలోనూ పెరిగిన వాటా
సేవారంగంతో పాటు తయారీ రంగం కూడా రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో తన వాటాను పెంచుకుంటోంది. 2024--25లో రూ.1,04,472 కోట్లుగా ఉన్న తయారీ రంగం విలువ 2025--26లో రూ.1,12,490 కోట్లకు పెరిగింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విలువ రూ.24,731 కోట్ల నుంచి రూ.27,396 కోట్లకు చేరింది. నిర్మాణ రంగం కూడా రూ.76,256 కోట్ల నుంచి రూ.84,960 కోట్లకు పెరిగింది.
ఇది రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మౌలిక వసతుల నిర్మాణం, పట్టణీకరణ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సూచిస్తోంది. ప్రస్తుత ధరల గణాంకాలతో పాటు స్థిర ధరల వద్ద నమోదైన వృద్ధి కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలను ఇస్తోంది. వ్యవసాయం, పశుసంవర్ధక, అటవీ, మత్స్య రంగాల విలువ రూ.94,195 కోట్ల నుంచి రూ.96,785 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గత ఆరేళ్లలో ఎంత మేర విస్తరించిందనేది ఎన్‌ఎస్డీపీ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
2020--21లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర ఎన్‌ఎస్డీపీ రూ.8.49 లక్షల కోట్లు కాగా.. 2025--26 నాటికి అది రూ.16.15 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిమాణం దాదాపు రెట్టింపైంది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో నమోదైన పెరుగుదల కూడా ఆర్బీఐ గణాంకాల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. 2020--21లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ తలసరి ఎన్‌ఎస్డీపీ రూ.2,25,734గా ఉండగా.. 2025-26లో అది రూ.4,18,931కు చేరింది.
మొత్తంగా ఆర్బీఐ తాజా గణాంకాలను ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో బహుముఖ వృద్ధి కనిపిస్తోంది. సేవారంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అండగా కొనసాగుతున్నప్పటికీ.. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
అయితే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరుతున్నాయా? వ్యవసాయ రంగ ఆదాయాలు, ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చిన్న పరిశ్రమల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.






