కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
కొత్తపల్లి,(విజయక్రాంతి): అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ జిల్లా 16వ మహాసభలను స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ అధ్యక్షతన జరిగింది. మహాసభల ప్రతీకగా ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మాజీ ఉమ్మడిరాష్ట్ర ఉపాధ్యక్షులు పైడిపల్లి రాజు ఎగురవేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ, కాంట్రాక్టీకరణ–ఔట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తూ శాశ్వత ఉద్యోగ అవకాశాలను కుదిస్తోందన్నారు.
నాలుగు లేబర్ కోడ్స్, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, నియామకాలలో జాప్యం, విద్యా–వైద్య రంగాల వాణిజ్యీకరణ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా విద్యా, రాజకీయ చైతన్యానికి కేంద్రంగా ఉన్నప్పటికీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత, గ్రంథాలయాల అభివృద్ధి లోపం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కొరత, క్రీడా సదుపాయాల లోపం, నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు.
జిల్లా పరిశ్రమల్లో స్థానిక యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, జిల్లా కేంద్రంలో ఆధునిక యువజన అభివృద్ధి కేంద్రం, స్టడీ సర్కిల్, కెరీర్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు. సెప్టెంబర్ 8, 9, 10వ తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువజన సమస్యల పరిష్కారానికి, విద్య–ఉపాధి హక్కుల సాధనకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, ప్రజాస్వామ్య–లౌకిక భారత నిర్మాణానికి కొత్త కార్యాచరణను రూపొందించనున్నాయన్నారు. అదే విధంగా మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువజన సంక్షేమానికి ప్రత్యేకమైన సమగ్ర విధానం అమలు చేయలేకపోయిందన్నారు.






