కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి
- జిల్లా కలెక్టర్‌కు పార్టీలకు అతీతంగా వినతి
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలంలోనే యంగ్ ఇండియా పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు పార్టీలకు అతీతంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో వారు పేర్కొన్న వివరాల ప్రకారం, నర్మెటలో జరిగిన ఆయిల్ పామ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా పాఠశాలలను ప్రారంభించినట్లు ప్రకటించారని తెలిపారు. కొండపాక మండలానికి కేటాయించిన యంగ్ ఇండియా పాఠశాలను ప్రస్తుతం వేరే ప్రాంతానికి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఈ పాఠశాలను కొండపాక నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తే మండలంలోని విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతారని, గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొండపాక మండలంలోనే యంగ్ ఇండియా పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు పాల్గొన్నారు.






