చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
ప్రభుత్వాన్ని కోరిన చేనేత సంఘం అధ్యక్షుడు స్వర్గం రాజేశం
గజ్వేల్: చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించి నేతన్నలను అన్ని విధాలా ఆదుకోవాలని గజ్వేల్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు స్వర్గం రాజేశం ప్రభుత్వాన్ని కోరారు. గజ్వేల్‌లో చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులకు దేవసాని బలగం–కుటుంబ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 14 ఏళ్లుగా సంఘానికి ఎన్నికలు జరగకపోవడంతో చేనేత రంగం నష్టపోయిందని, కొత్త పాలకవర్గం నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. నేతన్న భరోసా, నేతన్న మిత్ర, నేతన్న పింఛన్, ప్రమాద బీమా, ముడిసరుకుల సబ్సిడీలు అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి అందేలా కృషి చేస్తామని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల ప్రభావంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.






