ఆదర్శంలో ఆందోళన
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు
164 మంది ఉపాధ్యాయులు
నిర్మల్, జూన్ 23 (విజయక్రాంతి): ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టనున్నారు. ఉద్యోగంలో చేరి 11ఏళ్లు గడుస్తున్నా బదిలీలు, పదోన్నతులకు నోచుకోక పోవడంతో సోమవారం నుంచి వారం రోజుల పాటు నిరసనలు తెలుపనున్నారు. 2013లో ఉమ్మడి ప్రభుత్వం మోడల్ స్కూళ్ల ను ప్రారంభించింది. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేపట్టారు. ఒక్కో మోడల్ స్కూల్‌లో 820 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 మోడల్ స్కూళ్లు, 164 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
మోడల్ స్కూల్ లో బోధన చేపట్టేందుకు 2013 లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ చేపట్టింది. అప్పుడు ఏ బడిలోనైతే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లుగా చేరిన వారు ప్రమోషన్లకు నోచుకోక, నచ్చిన చోటకు బదిలీ కాకుండా ఒకే చోట ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు కార్పొరే ట్ స్థాయి విద్యను అందిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్నా ఉపాధ్యాయుల న్యాయ బద్ధమైన డిమాండ్లు మాత్రం నేరవేరడం లేదు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించినా కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం పీజీ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషాపండితుల పదోన్నతులు, బదిలీలు చేపడుతుండగా తమకు కూడా అవకాశం కల్పించాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కోరుతున్నారు.
నేటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన
ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు సోమవారం నుంచి వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నారు. బదిలీలు, పదోన్నతుల తో చేపట్టాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. పాఠశాలల్లో విద్యా బోధన చేస్తునే నిరసనలు తెలిపేలా కార్యచరణ రూపొందించారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకుంటే హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి. 13 ఏళ్లుగా ఒకే బడిలో పనిచేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నవి. సీనియారిటీ ప్రకారం బదిలీలు, పదోన్నతులు చేపడితే మాకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినం. బీఆర్‌ఎస్ సర్కార్ బదిలీలు చేపడుతామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తున్నదని ఆశిస్తున్నాం.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిర్మల్
మావి న్యాయబద్ధమైన డిమాండ్లు
మావి న్యాయబద్ధమైన డిమాండ్లు. మోడల్ స్కూల్‌లో 13 ఏళ్లుగా అంకిత భావం తో పనిచేస్తున్నాం. కార్పొరేట్ స్థాయి విద్యను పిల్లలకు నేర్పుతున్నాం. బదిలీలు, పదోన్నతులు చేపట్టి న్యాయం చేయాలి. సోమవారం నుంచి 29 వరకు వివిధ రూపల్లో మా డిమాండ్‌లను ప్రభుత్వానికి విన్నవిస్తాం.
తిరుపతిగౌడ్, ఉపాధ్యాయుడు, కుంటాల మోడల్ స్కూల్






