5 May, 2026 | 4:51 AM

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

24-06-2024 03:29 AM
  • నీటి పారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖాధి కారులతో కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19న హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేసిన ఆర్‌అండ్‌బీ పనులను అధికారులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. అనంతగిరి నుంచి చనుపల్లికి డబుల్ రోడ్డుకు రూ.20 కోట్లు, బరాకత్‌గూడెం నుంచి కాగిత రామచంద్రాపురం వరకు డబుల్‌రోడ్డుకు రూ.20 కోట్లు, ఎన్ హెచ్ 9 నుంచి మోతె వరకు డబుల్‌రోడ్డుకు రూ.25 కోట్లు, మల్లారెడ్డిగూడెం నుంచి రేవూరు వరకు డబుల్ రోడ్డుకు రూ.20 కోట్లు, అమరవరం నుంచి అలింగాపురం వరకు డబుల్‌రోడ్డుకు రూ.20 కోట్లు, నేరేడుచర్ల నుంచి దూపాడు వరకు డబుల్‌రోడ్డుకు రూ.20 కోట్లు మంజూరైనందున త్వరగా టెండర్లను పిలవాలని సూచించారు. అలాగే నూతనంగా ఏర్పడిన పాలకవీడు, చింతలపాలెం మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీ వో, పోలీస్‌స్టేషన్ల భవనాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ సీఈ మోహన్‌నాయక్, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.