15 June, 2026 | 11:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సబ్ కాంట్రాక్టులేవీ?

16-06-2024 12:51 AM

కాళేశ్వరంపై కొనసాగిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ

బహిరంగ విచారణలోనే క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్న కమిషన్

మేడిగడ్డను అప్పటి సీఎం కేసీఆర్ సూచించారు: రిటైర్డ్ ఇంజినీర్లు

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం నాడు రిటైర్డు ఇంజినీర్లతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిషన్ వారి నుంచి సమాచారాన్ని రాబట్టింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం అక్కడే చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్‌కు ఈ సందర్భంగా రిటైర్డు ఇంజినీర్ల కమిటీ రిపోర్టును సమర్పించింది.

మూడు బరాజ్‌లకు సంబంధించి సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో విచారణ కమిషన్ సమాచారాన్ని అధ్యయనం చేస్తోంది. ఈ సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన వివరాలను కమిషన్ సేకరిస్తోంది. అఫిడవిట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని, అది పూర్తయిన తరువాత.. తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తామని కమిషన్ పేర్కొంది. అసిస్టెంట్, డిప్యూటీ ఇంజినీర్లనుకూడా విచారణకు పిలువాలనే కసరత్తును కమిషన్ ప్రారంభించింది. అఫిడవిట్లను పరిశీలించిన తరువాత బహిరంగ విచారణ (ఓపెన్ కోర్టు)లోనే అందరినీ మరోసారి కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

2015లో ఏర్పాటైన అనంతరాములు కమిటీలోని రిటైర్డు ఇంజి నీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం భేటీ అయ్యింది. అప్పడు కమిటీ ఇచ్చిన రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు రిటైర్డు ఇంజినీర్లు అందించారు. మేడిగడ్డను అప్పటి సీఎం కేసీఆర్ సూచించినట్టు వారు తెలిపారు. తాము ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని, ఆయన చెప్పినట్టే చేశామని రిటైర్డు ఇంజినీర్లు తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదన చేసినా.. వద్దని పక్కన పెట్టారని తెలిపారు. తమ రిపోర్టును అప్పటి నీటిపారుదల శాఖ మంత్రికి, సీఎం కేసీఆర్‌కు అందించినా.. సంతకం చేయలేదని వారు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. 

ఈ సందర్భంగా సబ్ కాంట్రాక్టు వ్యవస్థపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. కాంట్రాక్ట్ ఏజెన్సీ అకౌంట్లు, స్టేట్‌మెంట్లను పరిశీలించాలనే ఆలోచనలో కమిషన్ ఉందని సమాచారం. ఆ అకౌంట్ల లెక్కలు చూస్తే.. ఎంతమేర చేతులు మారాయనేది తేలుతుందని కమిషన్ ఆలోచన. 

తాము పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిటైర్డు ఇంజినీర్లకు స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. విచారణకు రాకుంటే ఏం చేయాలో తనకు తెలుసునని, ఆ అధికారాలు ఉన్నాయని కమిషన్ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. అన్ని అఫిడవిట్లు పరిశీలించాక.. అవసరమైతే సీడబ్ల్యూసీ వాళ్ళనుకూడా పిలుస్తామని కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 10 నుంచి 15 సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, వాటి వివరాలను సేకరించే పనిలో కమిషన్ ఉంది. ప్రస్తుతానికి ఇంజినీర్లతో విచారణ పూర్తయ్యిందని, మళ్ళీ అఫిడవిట్లు వచ్చిన తరువాతనే విచారణ ఉంటుందని, ఏఈఈ, డీఈఈలను విచారించాలా.. లేదా అనేది కమిషన్ తరువాత ఆలోచించాలని భావిస్తోంది.