16 June, 2026 | 12:37 AM

ప్రభుత్వ దవాఖానల్లో 755 పోస్టుల భర్తీకి సై

16-06-2024 12:50 AM
  • 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్,

193 ల్యాబ్ టెక్నీషియన్స్,

31 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 531 భర్తీ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ర్ట వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెఎస్‌ఆర్‌బీ) త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. నియామకాల అనంతరం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా భర్తీ చేస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు సైతం రాష్ట్రంలో చాలా చోట్ల ఖాళీగా ఉన్నాయి.

ఈ తరుణంలో 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. వైద్యులకు అనుసంధానంగా ఉంటూ రోగులకు సేవలు అందించే స్టాఫ్ నర్సుల పోస్టులు సైతం రాష్ట్రంలో పలు చోట్ల ఖాళీలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది.  సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీ అనంతరం గ్రామీణ ప్రాంతాలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.  

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. ప్రతి వర్షాకాలం రాష్ర్టంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది.