ఎనీ టైం.. మినీ టీం!
లోక్‌సభ ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ!
ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో అవకాశం ఎవరికో?
జిల్లాలు, సామాజిక సమీకరణాలపై సీఎం కసరత్తు
ఆరింటిలో మూడు యువతకు ఇవ్వాలనే ఆలోచన
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత భర్తీ చేసే అవకాశం ఉం దని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని, ఇప్పటి వరకు ప్రాతినిథ్యం దక్కని జిల్లాలకు చోటు లభిస్తుందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దిశగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మంత్రివర్గంలో ఎమ్మె ల్యేల సంఖ్య ఆధారంగా 15 శాతం వరకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.
సీఎం పదవీతో పాటు 17 మందికి కేబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా, దాదాపు 10 నుంచి 15 మంది రేసులో ఉన్నారు. తమ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే డిమాండ్లు ఉండగా, వివిధ కుల సంఘాల నాయకులు సీఎం రేవంత్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో రేవంత్‌రెడ్డి కేబినెట్‌లోకి వచ్చే వారిలో ‘ సూపర్ సిక్స్’ ఎవరనేది పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్ నడుస్తోంది.
రెండో విడత మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కొందరు ఎమ్మెల్యేలు ఆశతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణలో భాగంగా బెర్త్ కన్‌ఫర్మ్ అవుతుందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో యువతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగిన వ్యూహ రచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడున్న మంత్రుల్లో ఐదారుగురు మినహా మిగతా వారు పార్టీ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వివరించడంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం లేదనీ, ఆ లోటును కొత్త మంత్రులతో భర్తీ చేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సామాజిక వర్గాల వారీగా వి‘భజన’!
కేబినెట్ విస్తరణ జరగనుందనే ప్రచారంతో ఖాళీ బెర్తుల్లో ఎవరెవరు ఉంటారనే చర్చ జోరందుకున్నది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ముదిరాజ్ వర్గానికి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కడే ఉన్నారు. శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే ఆ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగలరా..? లేదంటే అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్‌ను బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. అంతే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అధిష్ఠానం పెద్దలతో మంచి సంబంధాలు ఉండటం మంత్రి పదవీ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి ఫలితం ఉంటుందనే విషయాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లడానికి ఇది దోహదపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది శ్రీనివాస్ తెలంగాణలో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, పార్టీ, ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా ఉంటున్నారని, అందుకు మంత్రిగా ఛాన్స్ ఉండొచ్చని చెబుతున్నారు. ఇక కురుమ సామాజిక వర్గానికి చెందిన మరో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేరు కూడా వినిపిస్తోంది. ఎస్టీల్లో ఆదివాసీ సామాజిక వర్గం నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు.
లంబాడా సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జిల్లా నుంచి మొదటి విడత మంత్రి వర్గంలో ఎవరికి ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి మంత్రి పదవీ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరిద్దరి కంటే వెడ్మ బొజ్జాకు మంత్రి పదవి ఇచ్చి సామాన్యులను మంత్రులుగా చేశామనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి లేదంటే ముస్లిం మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. ఇక భువనగిరి పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సైతం ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఇక ఎస్సీలో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం ఉంది. పార్టీకి వీర విధేయుడిగా ఉన్న అద్దంకి దయాకర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. దయాకర్‌కు ఇప్పటికే ఒకటి, రెండు అవకాశాలు నోటిదాక వచ్చి చేజారిపోయాయని చెబుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, అద్దంకి దయాకర్‌కు మంచి పదవే ఇస్తానని అన్నారు. అంతేకాకుండా ఇటీవల మీడియా ఇష్టాగోష్టిలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్లకే మంత్రి పదవి ఇవ్వాలని ఏముందీ..? ముందు మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేయవచ్చనే విషయాన్ని రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రస్తావించడం.. అద్దంకి దయాకర్‌కు మంత్రి వర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ మాదిగలకు ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ లేదంటే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలో ఒకరికి అవకాశం దక్కొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఛాన్స్ ఎవరికో..
పేరు సామాజిక వర్గం ప్రస్తుత హోదా
వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఎమ్మెల్యే, మక్తల్.
బల్మూరి వెంకట్ వెలమ ఎమ్మెల్సీ, కరీంనగర్
ఆది శ్రీనివాస్ మున్నూరుకాపు ప్రభుత్వ విప్
బీర్ల అయిలయ్య కురుమ ప్రభుత్వ విప్,
బాలునాయక్ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యే, దేవరకొండ
రాంచ్రందనాయక్ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యే, మహ|
కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు వెలమ ఎమ్మెల్యే, మంచిర్యాల
గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ ఎమ్మెల్యే, పెద్దపల్లి
వెడ్మ బొజ్జు ఎస్టీ ఎమ్మెల్యే, ఖానాపూర్
సుదర్శన్‌రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే, బోధన్
షబ్బీర్ అలీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే, మునుగోడు
అద్దంకి దయాకర్ ఎస్సీ కాంగ్రెస్ సీనియర్ నేత
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎస్సీ ప్రభుత్వ విప్
వేముల వీరేశం ఎస్సీ ఎమ్మెల్యే, నకిరేకల్






