హెచ్‌ఎండీఏ అలర్ట్!
- ఆస్తిపాస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
- విలువైన స్థలాలు, భవనాలపై నిరంతర నిఘా
- 41 ప్రాంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నజర్
- ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) సొంత ఆస్తుల సంరక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. మహానగరం పరిధిలో 7 జిల్లాల వ్యాప్తంగా 70 మండలాల్లో హెచ్‌ఎండీఏకు విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్లు నిర్ధారించింది. దాదాపు 41 ప్రాంతాల్లో వీటిని గుర్తించింది. వీటితో మరో 70చోట్ల గల ఆస్తిపాస్తుల పరిరక్షణపై హెచ్‌ఎండీఏ దృష్టిసారించింది. అన్ని చోట్ల నిఘా ఏర్పాటు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిని నియమించి నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకుంది.
డిఎస్‌పి స్థాయి అధికారి నేతృత్వంలో ఒక సిఐ, ఒక ఎస్‌ఐ, 40 మంది హోం గార్డులతో పాటు మరో 100 సెక్యూరిటీ గార్డులను 41 ప్రదేశాలలో హెచ్‌ఎండిఏ భూముల పరిరక్షణకు సిబ్బందిని నియామకం చేసింది. ప్రస్తుతం మియాపూర్ ప్రాంతంలోని 100, 101 సర్వే నంబరు వద్ద 445 ఎకరాల విస్తీర్ణంలో విలువైన భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్నా.. పలువురు ఆక్రమణలకు ప్రయత్నం చేస్తుండటంతో హెచ్‌ఎండిఏ నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది.
ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సేవలు చాలా కీలకం. ముఖ్యంగా జవహ ర్‌నగర్, బంజా రాహిల్స్, మియాపూర్, బొల్లారం, మేడిపల్లి, ఎదులాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, కోకాపేట, తెల్లాపూర్, పుప్పులాగూడ, సాహెబ్ నగర్, హఫీజ్‌పేట, పేట్ బషీర్‌బాద్, శంషాబాద్, మోకిలా, అత్తాపూర్ తదితర 41 ప్రదేశాలలో హెచ్‌ఎండిఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తున్నా రు. ఆక్రమణలకు పాల్పడిన వారి పట్ల కేసులు నమోదు చేసి కూల్చివేత చేపడుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.






