ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ఐదు హామీలకు ఆమోదం
అమరావతి: సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. మూడున్నర గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి, అలాగే ల్యాండ్ టైటలింగ్ చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా ఏప్రిల్ నుంచి పింఛన్లను రూ.4వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించింది. కొత్త టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలు కూడా ఎజెండాలో ఉన్నాయి. డిసెంబరు 10 నాటికి 16,347 పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తూ డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు క్యాబినెట్‌కు సమర్పించారు. జూలై 1న ప్రక్రియ ప్రారంభం కానుంది.






