30 July, 2026 | 10:39 AM

జూరాలకు పోటెత్తిన వరద ప్రవాహం

30-07-2026 10:08 AM

10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల – 

12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు

ఆత్మకూరు, జూలై 30: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు(Jurala Project) వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 91,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, ప్రాజెక్టు అధికారులు 10 గేట్లను ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా, ప్రస్తుతం 1,041.360 అడుగుల నీటిమట్టం నమోదైంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.695 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదే సమయంలో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే వివిధ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టుకు సమృద్ధిగా నీరు చేరుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకు భరోసా లభిస్తుందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దిగువ ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.