9 June, 2026 | 1:11 AM

ప్రజావాణిలో 102 దరఖాస్తుల స్వీకరణ

09-06-2026 12:00 AM

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ

మహబూబ్ నగర్ టౌన్, జూన్ 8 : ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరిం చాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ పాల్గొన్నారు. ఈ సందర్ఫంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులతో  సమన్వయం చేసుకొని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సి.ఎం ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులను  ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అలాగే మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను కూడా పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి, వాటి వివరాలను ప్రజావాణి ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. త్వరలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున, అధికారులు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.