ఫిష్.. మండే ఎఫెక్ట్..
చేపల మార్కెట్లో రెండో రోజు కొనసాగిన అమ్మకాలు
ముషీరాబాద్ తగ్గిన చేపల విక్రయాలు
మృగశిర అయినా అమ్మకాలు అంతంత మాత్రమే..
చేపల మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
తనిఖీలు నిర్వహించిన తూనికలు, కొలతల శాఖ అధికారులు
ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మృగశిర కార్తె సందర్భంగా సోమవారం రెండవ రోజు అమ్మకాలు జోరుగా కొనసాగాయి. నగరంలోనే అతి పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్లో చేపల కొనుగోలు దారులతో సందడి నెలకొంది. ఇదిలా ఉంటే సోమవారం ఎఫెక్ట్ వల్ల అమ్మకాలు తగ్గడంతో పాటు చేపల ధరలు కూడా సాధారణ రోజులు లాగే ఉన్నాయి.
ఆదివారం పెద్ద ఎత్తున చేపలను కొనుగోలు చేశారని సోమవారం మృగశిర కార్తె రావడం వల్ల అమ్మకాలు తగ్గాయని వ్యాపారి గుడబోయిన శివప్రసాద్ పేర్కొన్నారు. బొచ్చ, రవ్వు చేపలు కిలో రూ.150 నుంచి రూ.170కి విక్రయించారు. కొర్రమీను చేపలు కిలో రూ.450 నుంచి పెద్ద సైజ్ చేపలను రూ.600లకు విక్రయించారు.
చేపల మార్కెట్ ఆధునికీకరణకు చర్యలు: ఎమ్మెల్యే ముఠా గోపాల్
నగరంలోనే అతి పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. మృగశిర కార్తె సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ చేపల మార్కెట్లో పర్యటించారు. వ్యాపారులు, కొనుగోలు దారులతో మాట్లాడారు.
మృగశిర సందర్భంగా కొనుగోలు దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ వంతుసహాయ సహకారాలు అందించామని తెలిపారు. చేపల మార్కెట్ ను అన్ని విధాలా ఆధునీకరించి ఆదర్శ చేపల మార్కెట్ లా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ముషీరాబాద్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పూసగోరక్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్లో తూనికల కొలతల శాఖ అధికారుల తనిఖీలు..
పలువురిపై కేసులు నమోదు..
మృగశిర సందర్భంగా చేపల మార్కెట్ కు పెద్ద ఎత్తున కొనుగోలు దారులు తరలిరానుండడం తో తూకంలో మోసం జరగకుండా లీగల్ మెట్రాలజీ హైదరాబాద్ జిల్లా అధికారులు తనిఖీలు చేశారు. చేపలను తూకం వేశాక వాటిని పరిశీలించారు. కొంత మంది వ్యాపారులు తూకం వేసే యంత్రాలకు స్టాంపింగ్ చేయించుకోక పోవడంతో ముగ్గురుపై కేసులు నమోదు చేశారు.
లీగల్ మెట్రాలజీ హైదరాబాద్ జిల్లా సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు దారులు మోసపోకుండా కమీషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. తూకంలో తేడా ఉందని కొనుగోలు దారులు గ్రహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవకతవకలకు పాల్పడిన ముగ్గురు వ్యాపా రులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూనికలు కొల తల శాఖ అధికారులు ప్రవీణ్, సురేందర్ రెడ్డి, సంజీవ్ రావు పాల్గొన్నారు.






