ముక్కిన ధాన్యంపై నిబంధనలు మాకేనా?: రైస్ మిల్లర్లు లబో దిబో!
- 3 శాతం అంటారు.. 15 శాతం వరకు పంపిస్తారు
- 3 శాతం లోపు ముక్కిన, రంగుమారిన బియ్యం
- ఇస్తే తీసుకోని ఎఫ్‌సీఐ, సివిల్ సప్లు శాఖ
- ఇదెక్కడి న్యాయమంటున్న రైస్ మిల్లర్లు
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): వాస్తవ విరుద్ధంగా నిబంధనలు రూపొందించి.. తమపై ప్రయోగించడమే తప్ప, నిబంధనలు రూపొందించినవారే వాటిని పాటించిన ధాఖలాలు లేవంటూ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు మండిపడుతున్నారు. రైస్ మిల్లర్లకు ధాన్యం సరఫరా, బియ్యం సేకరణ తదితర అంశాలపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), సివిల్ సప్లు సంస్థలు రూపొందించిన నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతూ, తమను బలిపశువు చేస్తున్నారని.. అదే నిబంధనలు వారుకూడా పాటించాలని, వారు అదేమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని రైస్ మిల్లర్లు వాపో తున్నారు. మొత్తంగా తమకు నష్టం కలిగించే నిబంధనలనే పాటించాలని వారు అంటున్నారు.
3 శాతం ముక్కిన/రంగు మారిన..
ధాన్యం సేకరణ సమయంలో 3 శాతం ముక్కిన/రంగు మారిన ధాన్యాన్ని మాత్రమే తీసుకోవాలనే నిబంధన ఉందని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఎఫ్‌సీఐ రూపొందించిన ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) నిబంధనల ప్రకా రం.. 3 శాతం వరకు రంగుమారిన, ము తక, ముక్కిన ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా.. రైస్ మిల్లర్లు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి, సివిల్ సప్లుకి పం పించేటప్పుడుకూడా ఇదే నిబంధన ప్రకారం 3 శాతం ముక్కిన/రంగుమారిన బియ్యాన్ని మాత్రమే అనుమతించా ల్సి ఉంటుంది. అంతకుమించితే అటు ధాన్యమైనా.. ఇటు బియ్యం అయినా తీసుకోరని వారంటున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో..
అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. వాతావరణ పరిస్థితులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులకు తోడు, రైతులు తీసుకొచ్చే ధాన్యంలో..ముక్కిన/రంగుమారిన ధాన్యం గింజల శాతం 15 శాతానికిపైగా ఉంటున్నాయని రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం.. అలాంటి ధాన్యాన్ని మిల్లర్లకు సరఫరా చేయకూడదు.
అయితే రాజకీయ ఒత్తిళ్లకు తోడు.. క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి ఎదుర య్యే అసంతృప్తిని తప్పించుకోవడానికి అధికార యంత్రాంగం కూడా తమపై ఒత్తిడి పెంచి.. 15 శాతానికిపైగా ముక్కిన/రంగుమారిన ధాన్యం/తడిచిన ధాన్యం సరఫరా చేస్తున్నారని.. రైస్ మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. రైతాంగం పరిస్థితి దృష్ట్యా వెసులుబాటు ఇవ్వవచ్చని.. కానీ దానిని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పాటించాలని వారంటున్నారు.
రెంటికీ చెడ్డ రేవడిలా..
మూడు శాతం వరకు తీసుకోవచ్చనే నిబంధనలను సడలించి.. ఒకపక్క 15 శాతానికి మించి ముక్కిన/రంగు మారిన ధాన్యాన్ని తమకు సరఫరా చేస్తూ.. కనీసం నిబంధనల ప్రకారం 3 శాతం వరకు ఉన్న బియ్యం కూడా తీసుకోకపోతే ఎలా.. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ రైస్ మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇటువైపు నిబంధనలను సడలించి.. 15 శాతం వరకు ముక్కిన/రంగుమారిన ధాన్యాన్ని సరఫరా చేస్తూ.. 3 శాతం వరకు అనుమతి ఉన్నప్పటికీ.. బియ్యాన్ని తీసుకోకుండా రిజెక్ట్ చేస్తే.. రెండు విధాలా తాము నష్టపోతున్నామని రైస్‌మిల్లర్లు మొత్తుకుంటున్నారు.
ఇలా రెండు విధాలా తాము నష్టపోతు న్నామని వారంటున్నారు. పేరుకే ప్రభుత్వ సంస్థలతో బియ్యం సరఫరాపై ఒప్పందం చేసుకుంటున్నామని.. కానీ అమలు విషయానికి వచ్చేసరికి.. తమనే బలిపశువుగా చేస్తున్నారని రైస్ మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఎంతశాతం ముక్కిన/రంగుమారిన ధాన్యం సరఫరా చేస్తారో.. అంతశాతం బియ్యాన్ని సరఫరా చేసే అవకాశం కల్పించాలన్నారు.
0.5 శాతం ఉన్నా ఒప్పుకోరు..
మూడు శాతం వరకు మాత్రమే ముక్కిన/రంగుమారిన/తడిచిన ధాన్యం తీసుకోవాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, రాజకీయ, అధికార ఒత్తిళ్ళతో.. 15 శాతం.. అంతకంటే ఎక్కువగా ఉన్నా తీసుకుంటున్న రైస్ మిల్లర్ల నుంచి.. అదే స్థాయిలో ఉండే బియ్యాన్ని మాత్రం ఎఫ్‌సీఐ, సివిల్‌సప్లు శాఖలు తీసుకోవడం లేదంటూ.. మిల్లర్లు లబోదిబోమంటున్నా రు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తరువాత.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి, సివిల్ సస్లు గోదాములకు తరలించాలి.
నిబంధనల ప్రకా రం ఇందులోనూ 3 శాతం వరకు ముక్కిన/రంగుమారిన బియ్యం ఉండవచ్చు. అయితే 0.5 శాతం ముక్కిన/రంగుమారి న బియ్యం ఉన్నా.. ఎఫ్‌సీఐ తీసుకోకుం డా.. వెనక్కి పంపిస్తుందని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. తమకు 15 శాతానికిపైగా ముక్కిన/రంగుమారిన ధాన్యాన్ని సరఫరాచేసి.. కనీసం 3శాతం ముక్కిన/రంగు మారిన బియ్యాన్ని తీసుకోకపోతే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.






