5 August, 2026 | 3:38 PM

రసబసాగా కాంగ్రెస్ సభ

05-08-2026 02:45 PM

నామినేటెడ్ పోస్టులను అర్హులకే ఇవ్వాలి

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో మంగళవారం రాత్రినిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం రస బసాగా సాగింది. గ్రూపు విభేదాలు మాని ఒకే జెండా కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేయాలని నాయకులంతా ఒకటేనని మాలో గ్రూపులు లేవని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాదవ్ నరేష్ ప్రకటిస్తుండగా, క్రింది స్థాయి కార్యకర్తలు మాత్రం గ్రూప్ విభేదాలను మరవడం లేదు.

మంగళవారం రాత్రి మండల కేంద్రంలోజరిగిన సమావేశంలో నాయకులు వారి వారి అభిమాన నాయకులను ఘనంగా సన్మానించడం జరిగింది. మరోవైపు సోనాల మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సహితం గ్రూప్ విభేదాలు బయల్పడ్డాయి. ఆది నాయకత్వం మండల కన్వీనర్లకు విభేదాలు లేకుండా చూడాలని ఆదేశాలిస్తుండగా క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీలో అసమ్మతి రాగం కనిపిస్తున్నది. 

నామినేటెడ్ పోస్టులను అర్హులకే ఇవ్వాలి

త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పోస్టులు అర్హులైన సీనియర్ నాయకులకే ఇవ్వాలని మండల కేంద్రంలోని కొంతమంది కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వెళితే మమ్ములను విడిపించేవారు లేరని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తే తమకు కావలసిన పనులు పూర్తి చేయాలని చెప్పేవారు లేరని కొంతమంది కార్యకర్తలు జిల్లా స్థాయి నాయకుల ఎదుట వాపోయారు. నామినేటెడ్ పోస్టులు త్వరలో ప్రకటించనున్న సహకార సంఘం అధ్యక్ష పదవికి అర్హులైన వారికి కట్టబెట్టాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఒక దశలో కొంతమంది కార్యకర్తలు జిల్లా స్థాయి నాయకుల పైన ఆరోపణలు చేయడం జరిగింది.

నామినేటెడ్ పోస్ట్ బేరానికి కుదిరిందని 12 లక్షల రూపాయలు తీసుకొని ఓ నాయకుడు పదవిని అమ్ముకుంటున్నాడని కార్యకర్తలు విమర్శించారు. అనామకులకు పదవులు ఇస్తే పార్టీ పాతాళం లోకి పోతుందని కొంతమంది నాయకులు పేర్కొన్నారు. నాయకుల వెంట తిరిగేవారికి పదవులు ఇస్తామంటే తాము కూడా వాహనాల్లో ప్రతిరోజు మీ వెంటే తిరుగుతామంటూ ధనుర్ గ్రామానికి చెందిన కొంతమంది కార్యకర్తలు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఐక్యత రాగం వినిపించాల్సిన సభలో గ్రూపు విభేదాలు కనిపిస్తున్నాయి.