5 June, 2026 | 12:58 AM

పుడతామా ఏటి మళ్లీ.. ఇప్పుడే సాధించు!

05-06-2026 12:00 AM

సమీక్ష

సినిమా: పెద్ది

ఇది పెద్దిగాడి స్ఫూర్తిమంత్రం 

రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ప్రకటించినప్పట్నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. 

భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలో అడుగుపెట్టిన ‘పెద్ది’ ప్రేక్షకుల మనసు గెలిచాడా? సమీక్షిద్దాం. 

కథ: విజయనగరం సమీపంలో కొండ కింద విసిరేసి నట్టు ఉన్న ఓ ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది (రామ్‌చరణ్) రోజూ విజయనగరం వెళ్లి ఓ చెరుకు ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మంచి క్రికెటర్ అయిన పెద్ది ఎటువైపు ఉంటే ఆ జట్టుదే గెలుపు! అంతటి తోఫు క్రికెటర్ కాబట్టే.. విజయనగరం, పరిసర గ్రామల జట్ల నిర్వాహకులు వేలంపాటలో పెద్దిని దక్కించుకుంటూ తమ తరఫున పోటీల్లో ఆడిస్తుంటారు.

పెద్ది  ఊరోళ్లను మాత్రం అవమానిస్తూ ఉంటారు నగర వాసులు  తమ కొండకింద గ్రామంలో ఒక రైల్వేస్టేషన్ ఏర్పాటు కోసం అప్పలసూరి (జగపతిబాబు) ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆటే ప్రపంచంగా బతుకు తున్న ‘పెద్ది’ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఘటన ఏంటి? కుస్తీలో తాను పహెల్వాన్ అని నిరూపించుకునే క్రమంలో అతను ఏమేం కోల్పోయాడు? ఆ రెజ్లింగ్‌లో సంతృప్తికర విజయాన్ని అందుకున్నాడా? పుట్టి పెరిగిన ఊరివాళ్లు తనను ఈసడించుకుంటున్నా..

పెద్ది కేవలం తన లక్ష్యం వైపే ఎందుకు ‘పరుగులు’ పెట్టాడు? ‘పెద్ది’ జర్నీలో గౌర్నా యుడు (శివరాజ్‌కుమార్) పాత్రేంటి? అచ్చయ్యమ్మి (జాన్వీకపూర్)కు ‘పెద్ది’కి మధ్య జరిగిన ప్రేమాయణం ఏంటి? చివరకు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? చివ రకు అప్పలసూరి కల నెరవేరిందా? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ: తన గ్రామానికి, అక్కడి ప్రజలకు గుర్తింపు తీసుకురావడానికి ఓ కుర్రాడు చేసిన పోరాటమే ‘పెద్ది’. క్రీడా నేపథ్యంతో స్ఫూర్తిని కలిగించే కథతో దర్శకుడు బుచ్చిబాబు సానా ‘పెద్ది’ని తీర్చిదిద్దడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. పెద్ది పాత్ర పరిచయం, క్రికెట్ టోర్నమెంట్, పాటలు తొలిభాగం హైలెట్‌గా నిలిచాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిని పెంచుతుంది. కుస్తీ కోసం చరణ్ శిక్షణ, ఢిల్లీ ఎపిసోడ్స్ వంటి అంశాలతో సెకండ్ హాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగు తుంది.

చివరి 40 నిమిషాలు భావో ద్వేగభరిత సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. పెద్ది తీసుకునే ఓ నిర్ణయం గుండెల్ని ద్రవింపజేస్తుంది. స్ఫూర్తి రలిగించే సందేశంతో కథను ముగించడం మెప్పిస్తుంది. అయితే, తొలిభాగం ల్యాగ్ అయ్యింది. చరణ్-, జాన్వీకపూర్ మధ్య, ట్రాక్, ఇద్దరి మధ్య ఎపిసోడ్ సగటు ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించవు. రామ్‌చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

‘పుడతామా ఏటి మళ్లీ..?’ అంటూ పెద్ది చెప్పే డైలాగ్ స్ఫూర్తిదాయకమైన మాటే. జాన్వి పాత్ర గ్లామర్, డ్యాన్సులకే పరిమిత మైంది తప్ప ఈ కథకు అంతగా అతకలేదు. జగపతిబాబు, శివరాజ్‌కుమార్ పాత్రలు మెప్పిస్తాయి. బోమన్ ఇరానీ, రావు రమేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, జాన్ విజయ్ పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. రత్నవేలు కెమెరా పనితీరు ప్రశంస నీయం. నవీన్ నూలి ఎడిటింగ్‌లో ఇంకాస్త స్వేచ్ఛ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.